LPG Price Hike: గ్యాస్ బండ ధర పెంపు ఎఫెక్ట్..
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:45 AM
వంటగ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం లబ్ధిదారులు మినహా మిగతా ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులపై ప్రభావం పడుతుంది.

రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలపై ప్రభావం
31 లక్షల మహాలక్ష్మి లబ్ధిదారులకు రిలీఫ్
మహాలక్ష్మి వినియోగదారులకు రూ. 500లకే సిలిండర్
హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): వంటగ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం లబ్ధిదారులు మినహా మిగతా ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులపై ప్రభావం పడుతుంది. 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.50 పెంచుతూ తీసుకున్న నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి రానున్నది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ప్రస్తుతం సిలిండర్ ధర రూ.855 పలుకుతుండగా, పెరిగిన ధరతో రూ.905లకు చేరుతుంది. రాష్ట్రంలో మొత్తం 130 లక్షల మంది వంటగ్యాస్ వినియోగదారులు ఉంటే.. వారిలో 39 లక్షల మందికి ‘మహాలక్ష్మి’ పథకం కింద ఉపశమనం లభిస్తుంది. మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500లకే గ్యాస్ సిలిండర్ పంపిణీచేస్తోంది. కేంద్రం నిర్ణయంతో హైదరాబాద్ గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం రూ.405 భరిస్తుంది. రాష్ట్రంలో మరో 11 లక్షల మంది ఉజ్వల పథకం లబ్ధిదారులున్నారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకూ పెంచిన ధర వర్తిస్తుంది కనుక వారు కూడా పెరిగిన ధర చెల్లించాల్సిందే. ఉజ్వల లబ్ధిదారులు మొత్తం చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పెంచిన గ్యాస్ ధర ప్రభావం మహాలక్ష్మి పథకం మినహా 91 లక్షల మంది గ్యాస్ వినియోగదారులపై భారం ఉంటుంది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గ్యాస్ ధరలు
ప్రాంతం పాత ధర పెరిగిన ధర ప్రస్తుత ధర
హైదరాబాద్ రూ. 855 రూ. 50 రూ. 905
వరంగల్ రూ. 874 రూ. 50 రూ. 924
కరీంనగర్ రూ. 878.50 రూ. 50 రూ. 928.50
నిజామాబాద్ రూ. 878.50 రూ. 50 రూ. 928.50
వికారాబాద్ రూ. 872 రూ. 50 రూ. 922
జగిత్యాల రూ. 875 రూ. 50 రూ. 925
భద్రాద్రి-కొత్తగూడెం రూ. 842 రూ. 50 రూ. 892