Land Encroachment Demolition: నిషేధిత భూముల్లో నిర్మాణాలు నేలమట్టం
ABN , Publish Date - Apr 20 , 2025 | 03:17 AM
హఫీజ్‌పేట, రాయదుర్గంలో ప్రభుత్వ నిషేధిత భూముల్లో నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. వందల కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకొని, ఆక్రమణదారులపై కేసులు నమోదు చేసింది

ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా
హఫీజ్‌పేట, రాయదుర్గంలో వందల కోట్ల భూమికి విముక్తి కల్పించినట్టు ప్రకటన
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలోని రెండు ప్రాంతాల్లో హైడ్రా శనివారం కూల్చివేతలు చేపట్టింది. హఫీజ్‌పేటలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేశామని.. వందల కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. శేరిలింగంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్ హఫీజ్‌పేట్ సర్వే నంబర్ 79లో మొత్తం 39.2 ఎకరాల భూమి ఉంటే.. ఇప్పటికే సగానికిపైగా నిర్మాణాలు జరిగాయని హైడ్రా వెల్లడించింది. వాస్తవానికి ఆ భూములు రెవెన్యూ రికార్డుల్లో నిషేధిత జాబితాలో ఉన్నాయని, తెలంగాణ హైకోర్టులో కేసు కూడా ఉందని పేర్కొంది. వసంత హోమ్స్ అనే సంస్థ సర్వే నంబర్ 79/1ను సృష్టించి.. ప్రభుత్వ వ్యవస్థలను తప్పుదోవ పట్టించి అక్రమ నిర్మాణాలు చేపట్టిందని తెలిపింది. ఇప్పటికే 20 ఎకరాల్లో ఇళ్లు నిర్మించి విక్రయించిందని.. మిగతా భూమిలో ఆఫీసు కార్యాలయంతోపాటు పలు షెడ్లు ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు అద్దెకు ఇచ్చిందని పేర్కొంది. ఈ భూములపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం పెండింగ్‌లో ఉందని, అయినా ఆ భూమిలో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసిందని గుర్తు చేసింది.
ఈ క్రమంలో శనివారం సర్వే నంబర్ 79లో ప్రహరీతోపాటు షెడ్లు, ఆఫీస్ నిర్మాణాలను తొలగించామని, అది ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు పెట్టామని వెల్లడించింది. మరోవైపు షేక్‌పేట్ మండలం రాయదుర్గం దర్గా సమీపంలోని సర్వే నంబర్ 5/2లోని భూమిని పరిశీలించామని, అక్కడ 39 ఎకరాల మేర ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు జరుగుతున్నట్టు నిర్ధారించామని హైడ్రా తెలిపింది. ఈ భూములపై కేసులు ఉన్నట్టు అక్కడ బోర్డులు ఉన్నప్పటికీ నార్నే ఎస్టేట్స్ సంస్థ ఆ భూముల్లో ప్లాట్ల కొనుగోలు కోసం సంప్రదించాలంటూ ఫోన్ నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేసిందని పేర్కొంది. అనుమతి లేని లేఔట్‌తో రహదారులు నిర్మిస్తూ, ప్లాట్ల అమ్మకాలు చేపట్టినట్టు, చెరువును కూడా కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నట్టు గుర్తించామని తెలిపింది. మొత్తంగా హఫీజ్‌పేట్, రాయదుర్గం ప్రాంతాల్లోని ఆక్రమణలను గుర్తించి, ప్రభుత్వ భూములుగా బోర్డులు ఏర్పాటు చేశామని, ఆక్రమణదారులపై పోలీసు కేసు నమోదు చేయించామని వివరించింది.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చారు
తమకు ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. హైడ్రా చేసినది సరైనదే అయితే కోర్టుకు సెలవు ఉన్నరోజే వచ్చి ఎందుకు కూల్చివేతలు చేపట్టారని ప్రశ్నించారు. హైడ్రా తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విదేశాల నుంచి తిరిగి రాగానే కలుస్తానని, ఆయన తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..
కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టులెట్ బోర్డు..
Read Latest Telangana News And Telugu News