TG High Court: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై హైకోర్టు ఆగ్రహం..
ABN , Publish Date - Apr 21 , 2025 | 01:03 PM
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని పిటిషనర్ ఆది శ్రీనివాస్ అన్నారు. చెన్నమనేని భారత పౌరుడు కాదని గత 15 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నానని చెప్పారు.

హైాదరాబాద్: వేములవాడ (Vemulavada) మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ (Ex-MLA Chennamaneni Ramesh) పౌరసత్వం (Citizenship)పై గతంలో ఇచ్చిన తీర్పుపై సోమవారం తెలంగాణ హైకోర్టు (TG High Court)లో విచారణ జరిగింది. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని, జర్మన్ పౌరుడని (German citizenship) న్యాయస్థానం తేల్చి చెప్పింది. తప్పుడు పత్రాలతో అధికారులు, న్యాయస్థానాలను 15 ఏళ్ల పాటు తప్పుదోవ పట్టించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. చెన్నమనేని కోర్టు ఖర్చుల కింద రూ. 30 లక్షలు పిటిషనర్‌కు చెల్లించాలని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. 30 లక్షల్లో పిటిషనర్ ఆది శ్రీనివాస్‌కు 25 లక్షల రూపాయలు, హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీకి రూ. 5 లక్షలు చెల్లించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని గత 15 ఏళ్లుగా ఆది శ్రీనివాస్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై అప్పీల్ చేయకుండా తప్పు ఒప్పుకుని కోర్టు ఖర్చుల కింద చెన్నమనేని రమేశ్ 30 లక్షల రూపాయలను చెల్లించారు. దీంతో సోమవారం హైకోర్టు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ ముందు రూ. 25 లక్షలు పిటిషనర్ ఆది శ్రీనివాస్‌కు చెన్నమనేని రమేష్ తరపు న్యాయవాది డీడీ అందించారు.
Also Read..: బంగారం భగ భగ.. రాత్రికి రాత్రే సీన్ రివర్స్..
15 ఏళ్ల పోరాటం..
ఈ సందర్భంగా పిటిషనర్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని గత 15 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నానని, హైకోర్టు తీర్పుపైన అప్పీల్ చేయకుండా తప్పు ఒప్పుకున్నారని.. కోర్టు ఖర్చుల కింద 30 లక్షల రూపాయలను చెన్నమనేని చెల్లించారని తెలిపారు. సోమవారం హైకోర్టు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ ముందు 25 లక్షల రూపాయలు తనకు డీడీ రూపంలో చెన్నమనేని తరపు న్యాయవాది అందించారని చెప్పారు. మరో అయిదు లక్షల రూపాయలను తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించారన్నారు.
వేములవాడ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి ..
చెన్నమనేని రమేశ్ వేములవాడ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇన్నాళ్లు ప్రజలను మోసం చేసి గతంలో ఎమ్మెల్యేగా కూడా ఉన్నారని అన్నారు. మా నియోజకవర్గం చల్లమనేని రమేష్ వల్లే ఇప్పటివరకు అభివృద్ధి చెందలేకపోయిందని విమర్శించారు. అక్రమంగా ప్రభుత్వం నుంచి తీసుకున్న జీతభత్యాలపై జర్మనీ , భారత హోం శాఖలకు ఫిర్యాదు చేస్తానన్నారు. దేశంలో ఇలాంటి నేత బహుశా ఎవరూ లేరన్నారు. భారత పౌరసత్వం లేకపోయినా ప్రజలందరినీ మోసం చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారన్నారు. చెన్నమనేని రమేష్ తీసుకున్న ప్రభుత్వ జీతభత్యాలపై త్వరలోనే ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. ఇప్పటికైనా చెన్నమనేని రమేష్ తన తప్పు ఒప్పుకుని ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
అట్లాంటాలో ఘనంగా సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు
For More AP News and Telugu News