CM Revanth Reddy: తెలంగాణకు కేసీఆర్ మరణశాసనం రాశారు
ABN , Publish Date - Jul 09 , 2025 | 07:42 PM
చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికి కేసీఆర్ నానా పాట్లు పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరంపై వాస్తవాలతో కూడిన నివేదికను కేంద్రం ఎదుట ఉంచామని తెలిపారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్‌కు సూచించానని, సవాల్ చేయలేదన్నారు.

హైదరాబాద్, జులై 9: చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికే కేసీఆర్ నానా పాట్లు పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంపై వాస్తవాలతో కూడిన నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారని చెప్పిన సీఎం రేవంత్, నివేదికల వాస్తవ పరిస్థితులను కేంద్రం ఎదుట ఉంచామన్నారు. తెలంగాణ సాధన కోసం ఎంతోమంది కొట్లాడారని, తెలంగాణ వచ్చాక కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్ గుర్తు చేశారు.
గత BRS ప్రభుత్వ నిర్ణయాల వల్లే తెలంగాణకు నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో తెలంగాణ నష్టపోయినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్‌కు సూచించానని, సవాల్ చేయలేదని సీఎం రేవంత్ స్పష్టత ఇచ్చారు.
కేసీఆర్ పాలనలోనే కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ చెప్పారు. నీళ్లు, నిధుల శాఖలను కేసీఆర్ కుటుంబమే పదేళ్లు నిర్వహించిందని గుర్తు చేసిన సీఎం రేవంత్.. చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికే కేసీఆర్ నీళ్ల సెంటిమెంట్ రేపుతున్నారన్నారు.
ఇంకా సీఎం రేవంత్ ఏ మన్నారంటే.. 'ఒకాయన ప్రెస్ క్లబ్‌కి వెళ్లి చర్చకు రమ్మని సవాల్ చేశారు. వీధులు, క్లబ్బులు, పబ్బుల్లో కాకుండా అసెంబ్లీలో చర్చకు రమ్మన్నాం. ఆయన పేరు చెప్పడం కూడా నా స్థాయికి తగదు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 TMCలు చాలని కేసీఆర్ సంతకం చేశారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవు.. గోదావరి నీరు కూడా రాయలసీమకు.. తరలించుకోండని జగన్‌కి కేసీఆర్ సలహాలు ఇచ్చారు. పదేళ్ల పాలనలో జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు. రూ.1000 కోట్లు ఖర్చు చేసి ఉంటే SLBC పూర్తయ్యేది. పాలమూరు-రంగారెడ్డి అంచనాలు పెంచి కూడా పూర్తి చేయలేదు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కృష్ణా నదిపై ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు కేసీఆర్ మరణశాసనం రాశారు. మరణశాసనం రాసే హక్కు కేసీఆర్‌కి ఎవరు ఇచ్చారు. అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షాన్ని నిలదీశారు.
'కృష్ణా ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే మనం వదిలితేనే ఏపీకి నీళ్లు వెళ్లేవి. కేసీఆర్ కారణంగానే కృష్ణా జలాల్లో ఏపీ నీటి దోపిడీ చేస్తోంది. గతంలో మంచి సూచనలు చేసిన చిన్నారెడ్డిని అవమానించారు. ఈ ప్రశ్నలు అడుగుదామంటే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణకు కేసీఆర్ వల్లే ఎక్కువ అన్యాయం. కేసీఆర్ చేసిన తప్పులకు వంద కొరడా దెబ్బలు కొట్టినా తప్పులేదు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం సమర్థంగా వాదనలు వినిపిస్తున్నాం. రాయలసీమకు నీళ్లు తీసుకోమని చెప్పే హక్కు కేసీఆర్‌కి ఎవరిచ్చారు. రాయలసీమ వాసులకు కేసీఆర్ పాలెగాడిగా మారారా?.' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
'ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే మన హక్కులు కోల్పోయాం. తప్పులు చేసి మాపై నెపం మోపుతున్నారు. మీరు చేసిన తప్పులను సరిదిద్దుతుంటే మాపై ఆరోపణలా?. ఏపీ వాళ్ల మెప్పు కోసం తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారు. జగన్, కేసీఆర్ మధ్య ఏముందనేది మాకు అనవసరం. కేసీఆర్ ఎప్పుడంటే అప్పుడు అసెంబ్లీ నిర్వహిస్తాం. కేసీఆర్.. మీరు రండి, నిపుణులను పిలిపిస్తాం, చర్చిద్దాం. అసెంబ్లీలో మా డాక్యుమెంట్లు కూడా ప్రవేశపెడతాం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ప్రభుత్వ చర్యలను వివరిస్తాం. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు.. ఆయన ఆరోగ్యంగా ఉండాలి. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి. మీ ఇంట్లో సమస్యలు ఉంటే మీరు తీర్చుకోండి. కేసీఆర్ ఆరోగ్యం బాగా లేదంటే.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనైనా చర్చకు సిద్ధం. మంత్రులతో మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం. క్లబ్‌లు, పబ్‌లు అంటే మాకు ఇబ్బంది. క్లబ్‌లు, పబ్‌లకు మేం మొదటి నుంచి దూరం. దయచేసి నన్ను క్లబ్‌లు, పబ్‌లకు పిలవొద్దు.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
లెవల్ క్రాసింగ్ గేట్లపై దృష్టి కేంద్రీకరించాలి
ఆ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
For More Andhrapradesh News