Hanuman Jayanti: శోభాయమానంగా హనుమాన్ జయంతి వేడుకలు
ABN , Publish Date - Apr 12 , 2025 | 08:04 AM
వీర హనుమాన్ జయంతి సందర్బంగా ఆలయాలన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తులు శనివారం తెల్లవారు జాము నుంచే ఆలయాలకు చేరుకుని ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్: హనుమాన్ జయంతి Hanuman Jayanti) సందర్భంగా ఆలయాలు (Temples) ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. శనివారం తెల్లవారు జామునుంచే భక్తులు హనుమాన్ ఆలయాలకు చేరుకుని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ వీర హనుమాన్ శోభాయాత్రలు (Shobha Yatra) జరగనున్నాయి. హిందూ బంధువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో హనుమాన్ జయంతి కూడా ఒకటి. రామ భక్తుడ్ని మనసారా పూజిస్తే.. అన్ని రకాలుగా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.
Also Read..: రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టులు
హనుమాన్ జయంతికి భారీ భద్రత..
‘జై బోలో హనుమాన్‌కి, జైశ్రీ రాం’ అంటూ భక్తుల ఆధ్యాత్మిక నినాదాలు, యువత ఉత్సాహంతో శనివారం నిర్వహించే హనుమాన్ జయంతికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించే శోభాయాత్రలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పశ్చిమ మండలం పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అదనపు బలగాలతో...
పశ్చిమ మండలం పరిధిలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, సంజీవరెడ్డినగర్, మధురానగర్, బోరబండ, మాసబ్‌ట్యాంక్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇప్పటికే ర్యాలీలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్వహిస్తారనే దానిపై పోలీసులకు స్పష్టత వచ్చింది. కొన్ని ర్యాలీలు ఉత్సవాలు జరిగే ఆలయాల పరిధిలోనే జరుగుతుండగా, మరికొన్ని ప్రధాన ర్యాలీల్లో కలుస్తుండటంతో అందుకు అనుగుణంగా అదనపు బలగాలను రంగంలోకి దించారు. సుమారు రెండు వేల మందికి పైగా అదనపు సిబ్బందిని హనుమాన్ శోభాయాత్ర బందోబస్తుకు ఉపయోగించనున్నారు. ఆలయాల వద్ద కూడా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయాలకు వచ్చే మహిళా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మహిళా సిబ్బందిని వినియోగిస్తున్నారు.
పోలీసులకు అందరూ సహకరించాలి..
బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీలు నిర్వహించే యువత పోలీసుల నిబంధనలను, ఆదేశాలను కచ్చితంగా పాటించాలని బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకట్‌రెడ్డి సూచించారు. ర్యాలీకి అవాంతరాలు ఏర్పడకుండా ముందస్తుగా సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి ర్యాలీని వీడియో కెమెరాతో చిత్రీకరిస్తామని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన, గొడవలకు దిగితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ర్యాలీలు చేసేందుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్లను ఏర్పాటు చేశామని ఏసీపీ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత
For More AP News and Telugu News