Hyderabad: హెచ్‌ఎండీఏ మెగా ఈ-వేలం !
ABN , Publish Date - Jun 18 , 2025 | 06:13 AM
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన లేఅవుట్లలోని 2,570 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ( హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ) సన్నాహాలు చేస్తోంది.

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అమ్మకానికి 2,570 ప్లాట్లు
కోకాపేట, బుద్వేల్, మరో పది ప్రాంతాల్లో స్థలాలు
రూ.4వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం
హైదరాబాద్ సిటీ, జూన్17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన లేఅవుట్లలోని 2,570 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ( హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ) సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లో హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్లాట్ల వేలానికి వస్తున్న అనూహ్య స్పందన నేపథ్యంలో ఈ చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు కోకాపేట, బుద్వేల్‌తోపాటు మరో పది ప్రాంతాల్లో ఉన్న ప్లాట్ల వివరాలను హెచ్‌ఎండీఏ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. రూ.4వేల కోట్లకు పైగా ఆదాయానిచ్చే ఆయా ప్లాట్లను విడతల వారీగా విక్రయించడానికి హెచ్‌ఎండీఏ అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే ప్లాట్ల ఈ-వేలం ప్రక్రియ మొదలవుతుంది. ఏడాదిన్నర క్రితం వరకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని ప్లాట్లను వేలం ద్వారా పెద్దఎత్తున విక్రయించారు. కోకాపేట నుంచి మేడిపల్లి వరకు లేఅవుట్లలోని ప్లాట్లను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.13వేల కోట్ల మేర ఆదాయాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్‌ఎండీఏ సమకూర్చింది. అప్పట్లో వివిధ ప్రాంతాల్లో డ్రాఫ్ట్ లేఅవుట్లను మాత్రమే ప్రకటించి ప్లాట్లను విక్రయించగా.. ఈ ఏడాదిన్నర కాలంలో హెచ్‌ఎండీఏ ఆయా లేఅవుట్లను అభివృద్ధి చేసింది. బహదూర్‌పల్లి, తొర్రుర్, కుర్మల్‌గూడ, తుర్కయాంజల్ ఇన్ముల్‌నార్వా, కోకాపేట లేఅవుట్లలోని పనులు తుది దశకు చేరాయి. ఇక మేడిపల్లి, బాచుపల్లి, మోకిల, బుద్వేల్ తదితర లేఅవుట్లలో అభివృద్ధి పనులు సాగుతున్నాయి.
కోకాపేటలో 24.05 ఎకరాలు..
హెచ్‌ఎండీఏకు కోకాపేటలో 24.05ఎకరాల విస్తీర్ణం ఉండే ఐదు ప్లాట్లు ఉండగా.. బుద్వేల్‌లో ఆరు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఒక ప్లాటు ఉంది. అలాగే, 150చ.గజాల నుంచి వెయ్యి చ.గజాల విస్తీర్ణం కలిగిన 2,564ప్లాట్లు శివారులోని 10 ప్రాంతాల్లో అందుబాటులో ఉండగా, వీటి మొత్తం విస్తీర్ణం 9.16లక్షల చదరపు గజాలు (189ఎకరాలు) వరకు ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే తొలి విడతలో కోకాపేట, బుద్వేల్‌లోని ప్లాట్లను, ఆ తర్వాత మిగిలిన ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించే అవకాశం ఉంది.