TG State BJP MPs Demand: 2,185 ఎకరాలు వర్సిటీకి రిజిస్టర్ చేయండి
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:51 AM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. 2012లో కేటాయించిన 2,185 ఎకరాల భూమి మొత్తం యూనివర్సిటీదే అని వారు ప్రకటించారు, వర్సిటీ భూములను కాపాడాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు

సీఈసీకి వినతిపత్రం సమర్పించిన బీజేపీ ఎంపీలు
హైదరాబాద్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి 400 ఎకరాలు సహా మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విస్తరించి ఉన్న భూములను వర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని రాష్ట్ర బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాలని డిమాండ్ చేస్తూ గురువారం వారు కేంద్ర సాధికార కమిటీ ప్రతినిధి బృందాన్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2012లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాసిన ఒక లేఖలో యూనివర్సిటీకి అందుబాటులో 2,185 ఎకరాల 7 గుంటల భూమి ఉందని పేర్కొన్న విషయాన్ని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రస్తావించారు. అందులో ఐఎంజీకి కేటాయించిన 400 ఎకరాలు కూడా ఉందని పేర్కొన్నారు. ఆ లేఖ ప్రకారం చూస్తే ప్రస్తుతం వేలం వేయడానికి ప్రయత్నిస్తున్న భూమి వర్సిటీదే అవుతుందని చెప్పారు.
హెచ్‌సీయూ భూములను కాపాడాలని 2022లో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అప్పటి కేంద్ర పర్యావరణ మంత్రి లేఖ రాశారని ఎంపీ రఘునందన్ గుర్తు చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వర్సిటీ భూములను కాపాడేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వర్సిటీ పచ్చదనాన్ని, అందులోని వన్య ప్రాణులను బీజేపీ ప్రభుత్వం మాత్రమే కాపాడగలదని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.