Share News

Hyderabad: పెంపుడు కుక్క కోసం అన్నదమ్ముల వైరం..

ABN , Publish Date - Jun 19 , 2025 | 11:24 AM

అన్నదమ్ముల మధ్య శత్రుత్వానికి కారణమవడంతో పాటు పోలీసు కేసులు పెట్టుకునే వరకు వెళ్లేలా చేసింది ఓ పెంపుడు కుక్క. చిక్కడపల్లికి చెందిన ఈబీ దక్షిణామూర్తి, ఈబీ నర్సింహమూర్తి సోదరులు. దక్షిణామూర్తి ‘డ్యూగో అర్జెంటినో’ జాతి కుక్కను (ఏరీస్‌) పెంచుకుంటున్నారు.

Hyderabad: పెంపుడు కుక్క కోసం అన్నదమ్ముల వైరం..

- సోదరుడి ఫిర్యాదు.. శునకాన్ని పట్టుకెళ్లిన జీహెచ్‌ఎంసీ

- పిటిషనర్‌కు అప్పగించాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: అన్నదమ్ముల మధ్య శత్రుత్వానికి కారణమవడంతో పాటు పోలీసు కేసులు పెట్టుకునే వరకు వెళ్లేలా చేసింది ఓ పెంపుడు కుక్క. చిక్కడపల్లికి చెందిన ఈబీ దక్షిణామూర్తి, ఈబీ నర్సింహమూర్తి సోదరులు. దక్షిణామూర్తి ‘డ్యూగో అర్జెంటినో’ జాతి కుక్కను (ఏరీస్‌) పెంచుకుంటున్నారు. తన సోదరుడు నర్సింహమూర్తి (Narasimha Murthy) తప్పుడు ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది తన పెంపుడు కుక్కను అక్రమంగా బంధించారంటూ దక్షిణామూర్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసుల సూచన మేరకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది తాను అపురూపంగా పెంచుకుంటున్న శునకాన్ని పట్టుకెళ్లారని, దాని సంరక్షణకు జీహెచ్‌ఎంసీ(GHMC) వద్ద తగిన సౌకర్యాలు లేవని పిటిషన్‌లో పేర్కొన్నారు. దానికి వెంటనే నాణ్యమైన ఆహారంతో పాటు అత్యవసర వైద్య చికిత్స చేయించాల్సి ఉందని తెలిపారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. సదరు కుక్కను యజమానికి అప్పగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది.


దాన్ని ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో కాకుండా వేరే చోటకు తరలించాలని పిటిషనర్‌ దక్షిణామూర్తికి స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు అయిన నర్సింహమూర్తిని ప్రతివాదిగా చేర్చాలని, వారి వాదన కూడా వింటామని తెలిపింది. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు చట్టప్రకారం పిటిషనర్‌కు నోటీసు ఇచ్చి చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. సదరు డ్యూగో అర్జెంటినో జాతి శునకాలకు భారత్‌లో అనుమతి ఉందో లేదో పరిశీలించాలని ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి.

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం

ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించాల్సిందే

Read Latest Telangana News and National News

Updated Date - Jun 19 , 2025 | 11:34 AM