Share News

High Court: ఆట ముగిశాక నిబంధనల మార్పు చెల్లదు

ABN , Publish Date - Apr 27 , 2025 | 04:59 AM

హైకోర్టు, ఆట ముగిసిన తర్వాత నిబంధనలను మార్చడం చెల్లదని తెలిపింది. గురుకుల విద్యాసంస్థల ఆర్ట్‌, క్రాఫ్ట్‌ టీచర్‌ పరీక్షలను తెలుగు, ఆంగ్ల భాషల్లో మళ్లీ నిర్వహించాలన్నారు

High Court: ఆట ముగిశాక నిబంధనల మార్పు చెల్లదు

ఆర్ట్‌, క్రాఫ్ట్‌ టీచర్‌ పరీక్షలను తెలుగులోనూ జరపాలి: హైకోర్టు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఆట ముగిసిన తరువాత నిబంధనలు మార్చడం చెల్లదని హైకోర్టు పేర్కొంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం పరీక్ష నిర్వహించాల్సిందేనని, మధ్యలో వాటిని మార్చడం సరికాదని స్పష్టం చేసింది. గురుకుల విద్యాసంస్థల సొసైటీ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్ట్‌, క్రాఫ్ట్‌ టీచర్‌ పోస్టులకు సంబంధించిన పరీక్షలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు పాటించలేదని తెలిపింది. దాంట్లో పేర్కొన్న ప్రకారం మళ్లీ తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇది 2023 నాటి నోటిఫికేషన్‌ కాబట్టి వీలైనంత వేగంగా భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది.


గురుకుల విద్యాసంస్థల్లో క్రాఫ్ట్‌ టీచర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ 7/2023 విడుదల చేశారు. నోటిఫికేషన్‌లో ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్లం భాషల్లో ఉంటుందని పేర్కొన్నారు. 2023 ఆగస్టు 1న నిర్వహించిన పరీక్షల్లో ప్రశ్నపత్రాలు ఆంగ్ల భాషలో ఉండటంతో చాలా మంది సరిగ్గా పరీక్షలు రాయలేకపోయారు. రెండు భాషల్లో పరీక్షలు మళ్లీ నిర్వహించాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా లాభం లేకపోవడంతో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ ధర్మాసనం విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష నిర్వహించడం చెల్లదని తెలిపింది.

Updated Date - Apr 27 , 2025 | 04:59 AM