Share News

Telangana: నేడు, రేపు వర్షాలు

ABN , Publish Date - Apr 20 , 2025 | 03:53 AM

రాష్ట్రంలో ఆదివారం, సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉంది. జనగామ జిల్లా నర్మెటలో వడగండ్ల వానతో ధాన్యం తడిసిపోయి, విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది

Telangana: నేడు, రేపు వర్షాలు

  • జనగామ జిల్లా నర్మెటలో వడగండ్ల వాన బీభత్సం

  • కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

  • రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు

  • (ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాలతో పాటు సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. కాగా, రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పొద్దంతా తీవ్రమైన ఎండలు కాయడం.. సాయంత్రానికి వానలు పడటం.. గత కొద్దిరోజులుగా పరిపాటిగా మారింది. శనివారం కూడా అదే పరిస్థితి కనిపించింది. పగటి ఉష్ణోగ్రతలు 40-44 డిగ్రీల వరకు నమోదవ్వగా.. సాయంత్రం పలుచోట్ల వానలు కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది. ఇక ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.


కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌లో 43.4, సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, ఇల్లంతకుంట, నిజామాబాద్‌ జిల్లాలో 42.3 డిగ్రీలు నమోదైంది. జనగామ జిల్లా నర్మెట మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆగపేట, గండిరామవరం, వెల్దండ, అమ్మాపురం, మచ్చుపహడ్‌, హన్మంతాపూర్‌, బొమ్మకూరు తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. విద్యుత్తు తీగలు, స్తంభాలపై చెట్లు విరిగిపడి కొన్నిచోట్ల కరెంట్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాలాచోట్ల కోతకు వచ్చిన వరి పంట నేలవాలి ధాన్యం రాలిపోయింది. వెల్దండలోని ఓ కొనుగోలు కేంద్రంలో క్వింటాళ్ల కొద్దీ ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ఇటు గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు పడ్డాయి.


ఇవి కూడా చదవండి..

Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..

కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి టులెట్‌ బోర్డు..


Read Latest
Telangana News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 03:53 AM