Harish Rao Banakacharla Project: బనకచర్ల రేపటి తెలంగాణకు నష్టం
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:53 AM
బనకచర్ల ప్రాజెక్టు రేపటి తెలంగాణకు నష్టమని, రాష్ట్ర హక్కులను తాము కాపాడుకుంటామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు.

గోదావరిలో అదనపు నీళ్లుంటే.. తెలంగాణ వాటా తేల్చాలి
విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో పునఃపరిశీలన జరగాలి
తెలంగాణలో ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న ఆంధ్రా పాలకులు
మాజీమంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, జూలై 18 (ఆంధ్రజ్యోతి)/ చిన్నకోడూరు : బనకచర్ల ప్రాజెక్టు రేపటి తెలంగాణకు నష్టమని, రాష్ట్ర హక్కులను తాము కాపాడుకుంటామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు. సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు రెండు రోజులపాటు నిర్వహించనున్న శిక్షణ తరగతులను ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. గోదావరి నీళ్లను బనకచర్ల వద్దకు తీసుకెళ్లి రాయలసీమ ప్రాంతానికి లిఫ్టు, టన్నెల్ ద్వారా అందించే ప్రాజెక్టే జీబీ లింక్ అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు 968 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు కేటాయిస్తూ బచావత్ ట్రైబ్యునల్ 1980లో గెజిట్ విడుదల చేసినట్లు తెలిపారు. తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయించడం తప్పు అని, అక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలని సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ కేంద్రానికి ఉత్తరాలు రాశారని గుర్తుచేశారు. సముద్రంలో కలిసిపోతున్న నీరు తీసుకుంటామంటున్న మీరు, తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు అడ్డు చెప్తున్నారని ప్రశ్నించారు. ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన తర్వాత, రెండు రాష్ట్రాల్లో విభజన చట్టం ప్రకారం పునః పరిశీలన జరగాలే తప్ప, బనకచర్లకు 200 టీఎంసీలు తీసుకుపోతామంటే ఎలా? అంటూ ప్రశ్నించారు. గోదావరిలో అదనంగా నీళ్లుంటే తెలంగాణకు రావాల్సిన వాటా ఎంతో తేల్చాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిధులు కేటాయించడం లేదు
గతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంవత్సరానికి రూ. 5 కోట్ల నిధుల కేటాయింపు ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. చిన్నకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కంప్యూటర్ ల్యాబ్‌ను ఆయన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివా్‌సతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని ఆపేసిందని, అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా ఒక్క తరగతి గదిని కూడా నిర్మించలేదన్నారు.
రాహుల్ మౌనమేల?
హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : రాజకీయంగా ఏమి చేయలేక.. మీ బావమరిదిని ప్రభుత్వం వెంటాడి.. అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని ఆరోపిస్తున్న రాహుల్‌గాంధీ.. తెలంగాణలో జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో కేసీఆర్ కుటుంబంపై ప్రతీకార రాజకీయాలు చేస్తుంటే రాహుల్ ఎందుకు మౌనంగాఉన్నారని శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతలపై తెలంగాణ సీఎం కొనసాగిస్తున్న వంచన రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని.. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి