Share News

Harish Rao: మంత్రి ఉత్తమ్‌ చెప్పేవన్నీ అబద్ధాలే!

ABN , Publish Date - Apr 30 , 2025 | 04:07 AM

మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని జాతీయ డ్యామ్‌ భద్రతా సంస్థ (ఎన్డీఎ్‌సఏ) ఎక్కడా చెప్పలేదని మాజీ మంత్రి హరీశ్‌ చెప్పారు.

Harish Rao: మంత్రి ఉత్తమ్‌ చెప్పేవన్నీ అబద్ధాలే!

  • ఎన్‌డీఎ్‌సఏ నివేదిక పేరిట దుష్ప్రచారం

  • మంత్రి అజ్ఞానంతో కాదు, విజ్ఞానంతో ఆలోచించాలి: హరీశ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని జాతీయ డ్యామ్‌ భద్రతా సంస్థ (ఎన్డీఎ్‌సఏ) ఎక్కడా చెప్పలేదని మాజీ మంత్రి హరీశ్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు చెప్పారని పేర్కొన్నారు. ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ఆధారంగా ఉత్తమ్‌ రాజకీయ ప్రసంగం చేశారని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. అందుకే ఎన్డీఎ్‌సఏ నివేదికను ఈడీ, సీబీఐలాగా వాడుతున్నాయని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రాథమిక, లోక్‌సభ ఎన్నికలప్పుడు మధ్యస్థ, బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ వేళ తుది నివేదిక అంటూ తమ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్డీఎ్‌సఏ ఏర్పాటు బిల్లును కాంగ్రెస్‌ పక్షాన లోక్‌సభలో వ్యతిరేకించిన ఉత్తమ్‌.. ఇప్పుడు ఆ సంస్థను ప్రపంచ ప్రఖ్యాత సంస్థగా అభివర్ణిస్తున్నారని విమర్శించారు. పోలవరం అథారిటీ చైర్మన్‌గా పనిచేసిన ఎన్డీఎ్‌సఏ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ పోలవరం కడితే కుప్పకూలిందని, ఐదేళ్లయినా దాన్ని ఎందుకు సందర్శించలేదని నిలదీశారు.


రేవంత్‌ది అసత్య ప్రచారం..

ఎన్డీఎ్‌సఏ నివేదికతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి అసత్య ప్రచారానికి తెగబడ్డారని హరీశ్‌ ఆరోపించారు. ఆ నివేదికను సరిగా చదవాలని సూచించారు. ఎన్‌డీఎ్‌సఏ నివేదిక కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నే తప్పుపట్టిందన్నారు. తగినన్ని నిధులు కేటాయించి, సరైన పద్ధతిలో నిర్వహణ చేపట్టి, జలాశయానికి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెబితే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఏడో బ్లాక్‌ను పునర్నిర్మించడం ద్వారా మేడిగడ్డను వాడుకోవచ్చని నివేదికలో పేర్కొందని చెప్పారు. రాజకీయ ప్రేరేపితంగా ఎన్‌డీఎ్‌సఏ తన నివేదికను ఇచ్చినట్లు స్పష్టమవుతోందన్నారు. నివేదికతో రాజకీయ లబ్ధి పొందాలనే ఆరాటం తప్ప ప్రాజెక్టును కాపాడి, రైతులకు నీళ్లివ్వాలన్న ఆలోచన రేవంత్‌ సర్కార్‌కు లేదని తేలిపోయిందని హరీశ్‌ అన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని ఆరోపించేందుకు ఉత్తమ్‌కు సిగ్గుండాలన్నారు. ఆ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించింది కాంగ్రెస్సేనని చెప్పారు. సర్వే మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ పేరిట రూ.1426 కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నీటి లభ్యత లేదని చెప్పడంతోనే తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిందని చెప్పారు. ఆయకట్టు రెండింతలైందని, అందుకు అనుగుణంగా నిర్మాణ వ్యయం కూడా పెరిగిందని.. కాంగ్రెస్‌ చేసిన తప్పును తాము సరిచేశామని తెలిపారు. ఈ విషయాన్ని ఉత్తమ్‌ అజ్ఞానంతో కాక విజ్ఞానంతో ఆలోచించాలని హితవు పలికారు.


కొడంగల్‌ లిఫ్ట్‌కు డీపీఆర్‌ ఉందా?

మేడిగడ్డను ప్రారంభించిన 4 నెలల వరకు డీపీఆర్‌ లేదని చెబుతున్నారని.. కొడంగల్‌ ఎత్తిపోతల ప్రాజెక్టుకు డీపీఆర్‌ లేకుండానే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించారని హరీశ్‌ ఆరోపించారు. ‘సిగ్గు లేకుండా మమ్మల్ని విమర్శిస్తున్నావ్‌. ఉత్తమ్‌ మీకో నీతి మాకో నీతా?’ అని ధ్వజమెత్తారు. పరిస్థితులు, ముంపు, అవసరాలను బట్టి ప్రాజెక్టుల నిర్మాణ స్థలాలు మారతాయని.. అందులో తప్పేముందని నిలదీశారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్పుపై మంత్రివర్గ ఉపసంఘంలో అప్పట్లో తుమ్మల, ఈటలతోపాటు తాను కూడా సంతకం చేశానని హరీశ్‌ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా కాంగ్రెస్‌ను నిలదీస్తూనే ఉంటామని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. తెలంగాణకు ఎప్పటికీ కాంగ్రెస్సే విలన్‌ అని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ

Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్

For Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2025 | 04:07 AM