Harish Rao Emotional Moment: బాలిక దుఃఖం చూసి హరీశ్ కన్నీరు
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:53 AM
సిద్దిపేటలో జరిగిన విద్యార్థుల సదస్సులో ఓ బాలిక తన కుటుంబ కష్టాలను తెలిపి కన్నీళ్లు పెట్టుకుంది, ఈ దృశ్యాన్ని చూసి హరీశ్ రావు భావోద్వేగానికి గురయ్యారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని, తెలుగు పుస్తకాలు చదవాలని విద్యార్థులకు హితవు పలికారు.

సిద్దిపేటలో విద్యార్థుల సదస్సులో ఘటన
కుటుంబం కష్టాలు చెబుతూ ఓ విద్యార్థిని ఆవేదన
చిన్నారిని ఓదార్చుతూ హరీశ్ కంటతడి
వేసవి సెలవులను సరిగా వినియోగించుకోవాలని పిల్లలకు హితవు
సిద్దిపేట/సిద్దిపేట కల్చరల్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ఓ విద్యార్థిని తమ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకోగా.. ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకొన్నారు. శనివారం సిద్దిపేటలో ఈ ఘటన జరిగింది. వేసవి సెలవుల్లో పిల్లలు చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్థానిక మెట్రోగార్డెన్‌లో ‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్తులో ఎదగాలి’ పేరిట ఓ సదస్సును నిర్వహించారు. హరీశ్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాత్విక అనే ఏడో తరగతి విద్యార్థిని మాట్లాడుతూ.. తనకు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే తన తండ్రి చనిపోయాడని పేర్కొంది. తల్లి పడుతున్న కష్టాలను చెబుతూ ఏడ్వసాగింది. వేదిక మీద ఉన్న హరీశ్‌రావు.. ఆ బాలికను తన పక్కనే కూర్చోబెట్టుకొని ఓదారుస్తూ.. తానూ భావోద్వేగానికి గురయ్యారు.
చిన్నారి మాట్లాడుతుంటే తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాలను పిల్లలు గుర్తించాలన్నారు. కాగా, ఈ సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి హరీశ్ మాట్లాడుతూ.. తెలుగు మాట్లాడితే చాలదని, తెలుగులో రాయడం, చదవడం రావాలని సూచించారు. వేసవి సెలవుల్లో తెలుగు పుస్తకాలు, పత్రికలు చదవాలన్నారు. సెలవుల్లో అమ్మానాన్నలకు చెప్పకుండా ఎటువంటి సాహసాలకు పాల్పడవద్దని, ప్రాణాలు భద్రంగా కాపాడుకుంటేనే భవిష్యత్తులో ఎదుగుతారని హితవు పలికారు.
మా నాన్న క్యాన్సర్ బాధితుడే!
కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉచిత క్యాన్సర్ పరీక్ష, వైద్య శిబిరానికి హరీశ్‌రావు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ జబ్బు వ్యాధి పీడితులనే కాకుండా, వారి కుటుంబసభ్యులను కూడా కుంగదీస్తుందన్నారు. తన తండ్రి కూడా క్యాన్సర్ బాధితుడేనని, ఒక కొడుకుగా ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే నివారించవచ్చని, మధ్యవయస్సు వచ్చిన వారందరూ తప్పనిసరిగా తరచూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..
కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టులెట్ బోర్డు..
Read Latest Telangana News And Telugu News