Harish Rao: యువనేతలకు కొప్పుల ఈశ్వర్ ఆదర్శం
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:00 AM
కోపుల ఈశ్వర్ బొగ్గు గని కూలీగా మొదలుకొని, రాజకీయాల్లో ఎన్నో పోరాటాలు చేసి, मंत्री పదవి వరకు ఎదిగిన విధానం ప్రేరణ కలిగించదగినది. ఈశ్వర్ పార్టీకి, ప్రజలకు నిజాయతీతో సేవలు అందించిన నిదర్శనంగా నిలిచారు.

ఈశ్వర్ జీవిత కథ ‘ఒక ప్రస్థానం యాభై ఏళ్ల ప్రయాణం’ పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారికి, రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్న వారికి కొప్పుల ఈశ్వర్ ఆదర్శమని బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జీవితానుభవాల సమాహారం ‘ఒక ప్రస్థానం యాభై ఏళ్ల ప్రయాణం’ అనే పుస్తకాన్ని హైదరాబాద్, జలవిహార్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కోపం, అసహనం ఇసుమంతైనా లేని ఈశ్వర్‌లోని పోరాటయోధుడిని ఈ పుస్తకం పరిచయం చేస్తుందని పేర్కొన్నారు. బొగ్గు గని కూలీ నుంచి మంత్రి వరకు సాగిన ఈశ్వర్ ప్రస్థానం ఆదర్శనీయమని కొనియాడారు.
నమ్మిన సిద్ధాంతం కోసం, పార్టీ కోసం నిజాయతీగా పనిచేస్తే పదవులు వాటంతటవే వస్తాయనడానికి కొప్పుల ఈశ్వర్ నిదర్శనం అన్నారు. ఈశ్వర్ ఎదుగుదలలో ఆయన జీవిత భాగస్వామి స్నేహలత సహకారం ఎంతో ఉందని ప్రశంసించారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికోద్యమ, నక్సలరీ, మలిదశ తెలంగాణ పోరాటాల చరిత్రను అధ్యయనం చేయడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది అన్నారు. మాజీ మంత్రులు మొహమ్మద్ అలీ, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత నూతి మల్లన్న, సినీ రచయిత, ఎంపీ ప్రసాద్, జస్టిస్ చంద్రయ్య, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ గంటా చక్రపాణి, మండలి ఉప సభాపతి బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ రమణ, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, సీపీఐ (ఎంఎల్) నేత వేములపల్లి వెంకట్రావు, సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సినీ దర్శకుడు ఎన్.శంకర్ పాల్గొన్నారు.