Harish Rao BRS: ఆంధ్రాలో ఎకరా అమ్మితే.. తెలంగాణలో రెండెకరాలు వస్తోంది!
ABN , Publish Date - Jul 22 , 2025 | 03:58 AM
గతంలో తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు వచ్చేదని, ఇప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే ఇక్కడ రెండు ఎకరాలు వస్తోందని బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు.

18 నెలల్లోనే రాష్ట్ర పరిస్థితి తారుమారైంది
భూముల ధరలు దారుణంగా పడిపోయాయి
రేవంత్ పాలనలో ఓట్లప్పుడే రైతు బంధు: హరీశ్
గజ్వేల్/హైదరాబాద్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): గతంలో తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు వచ్చేదని, ఇప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే ఇక్కడ రెండు ఎకరాలు వస్తోందని బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. పద్దెనిమిది నెలల్లో తెలంగాణ పరిస్థితి తారుమారైందని, భూముల ధరలు దారుణంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కార్లు, మోటారు సైకిళ్లను అప్పులోళ్లు గుంజుకుపోతున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో వరి నాట్లకు ముందు రైతు బంధు ఇస్తే... ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఓట్లకు ముందు మాత్రమే రైతుబంధు ఇస్తున్నాడని విమర్శించారు. డబ్బాలో ఓట్లు పడగానే.. రైతు బంధును ఎగ్గొడుతున్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వచ్చాక ఎరువుల కోసం చెప్పులు ‘క్యూ’లో పెట్టి ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఇవ్వకపోగా.. రెండు లక్షల పింఛన్లు నిలిపివేశారని దుయ్యబట్టారు. హామీలను విస్మరించి.. పోలీస్ పహారాలో తిరుగుతున్న రేవంత్‌రెడ్డికి అశోక్‌నగర్ వెళ్లే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఓటర్ల వద్దకు వెళ్లి రేవంత్ చేస్తున్న మోసాలు, గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వివరించాలని కార్యకర్తలకు సూచించారు. సిద్దిపేట, మెదక్‌లో మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంటామని, 16-18 జిల్లా పరిషత్‌లు కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కల్లు దుకాణాలు బంద్ చేస్తే..ఊరుకోం
రాష్ట్రంలో కల్లు దుకాణాలను బంద్ చేస్తే కాంగ్రెస్ సర్కార్‌ను స్తంభింపజేస్తామని బీఆర్‌ఎస్ నేతలు వి.శ్రీనివా్‌సగౌడ్, బూడిద భిక్షమయ్యగౌడ్, పల్లె రవికుమార్‌గౌడ్ హెచ్చరించారు. లిక్కర్ మాఫియాకు తలొగ్గి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కల్లు గీత వృత్తిని బంద్ చేయాలని చూస్తోందని ఆరోపించారు. కులవృత్తులను నాశనం చేయాలని చూస్తే ఊరుకోమని, కేసీఆర్ సీఎం కాగానే మళ్లీ కల్లు దుకాణాలను తెరిపిస్తామని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News