Harish Rao: తెలంగాణకు గురుశిష్యుల ద్రోహం
ABN , Publish Date - Jul 27 , 2025 | 06:02 AM
రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడిందని, బనకచర్ల ప్రాజెక్టుతో గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించే కుట్ర జరుగుతోందని బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

బనకచర్లతో గోదావరి జలాలకు ఎసరు
నదీ జలాల వాటాలు ముందుగా తేల్చండి
లేదంటే మరో తెలంగాణ ఉద్యమం తప్పదు: హరీశ్
ఉప్పల్/మల్లాపూర్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడిందని, బనకచర్ల ప్రాజెక్టుతో గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించే కుట్ర జరుగుతోందని బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు, నిధులు రాహుల్‌కు వెళ్తున్నాయని విమర్శించారు. గురు శిష్యులైన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. గోదావరి జలాల్లో ఆంధ్రా, తెలంగాణ వాటాలు తేల్చిన తర్వాతే బనకచర్లపై ముందుకు సాగాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్‌లో శనివారం నిర్వహించిన బీఆర్‌ఎ్‌సవీ రాష్ట్ర స్థాయి సదస్సులో గోదావరి జలాలు- బనకచర్ల ప్రాజెక్టుపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ద్రోహులెవరన్న దానిపై చరిత్ర రాస్తే మొదటి పేరు చంద్రబాబు, రెండో పేరు రేవంత్‌రెడ్డిదే ఉంటుందని వ్యాఖ్యానించారు. నాడు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన రేవంత్‌రెడ్డి... నేడు గోదావరి జలాలను ఆంధ్రాకు కట్టబెట్టేందుకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. ‘‘62వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్‌ను బీఆర్‌ఎస్ దిగిపోయే నాటికి 3లక్షల కోట్ల దాకా తెచ్చాం. కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పులు చేసి 95శాతం ఉద్యోగాలు తెలంగాణ యువకులకే వచ్చేలా చేశాం. తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన విద్యార్థులకు.. రాజకీయ పదవులు ఇచ్చాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రాలోని టీడీపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి తెలంగాణ హక్కులకు భంగం కలిగించే కుట్రలు పన్నుతున్నాయి. తెలంగాణ పల్లెల్లో తెలంగాణకు మరోసారి జరుగుతున్న అన్యాయాన్ని విద్యార్థులుగా మీరంతా పల్లెలకు వెళ్లి ప్రజలకు తెలియజేయాలి. గురు శిష్యులు చంద్రబాబు, రేవంత్‌లు తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని పూసగుచ్చినట్లు చెప్పాలి.’’ అని సూచించారు.
ఈవార్తలు కూడా చదవండి..
పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు
Read latest Telangana News And Telugu News