Share News

Gutta Sukender Reddy: అసహ్యకరంగా రాజకీయ నేతల భాష

ABN , Publish Date - Jul 22 , 2025 | 05:01 AM

ప్రస్తుతం రాజకీయ నేతలు వాడుతున్న భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Gutta Sukender Reddy: అసహ్యకరంగా రాజకీయ నేతల భాష

  • నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి

  • కలచివేసిన కవిత, తీన్మార్‌ మల్లన్న ఘటన: గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం రాజకీయ నేతలు వాడుతున్న భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార, ప్రతిపక్ష నేతలు తాము వాడుతున్న భాషతో భవిష్యత్తు తరాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ నేతలు తాము వాడే భాష పట్ల ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కేంద్రంతోపాటు ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఎన్నికల్లో భారీ వ్యయాలను కట్టడి చేయాలని గుత్తా పేర్కొన్నారు.


ఎన్నికల వ్యయం రూ.వేల కోట్లలో ఉండటం వల్లే అన్ని రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోయిందని చెప్పారు. ఎన్నికల ఖర్చుతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలనూ నియంత్రించాలని ఆయన చెప్పారు. ఇక పెద్దల సభలో సభ్యులు హుందాగా ఉండాలని హితవు చెప్పారు. సభ బయటే అయినా ఎమ్మెల్సీలు కవిత, తీన్మార్‌ మల్లన్న మధ్య జరిగిన ఘటన తనను కలచివేసిందని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని, అందుకే దాన్ని తెలంగాణ గట్టిగా వ్యతిరేకించిందన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 05:01 AM