Share News

Group-1: జాప్యం వద్దు.. నియామక పత్రాలు ఇవ్వండి

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:41 AM

గ్రూప్‌-1కు ఎంపికైన వారికి జాప్యం చేయకుండా నియామకపత్రాలు అందించాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు.

Group-1: జాప్యం వద్దు.. నియామక పత్రాలు ఇవ్వండి

  • ప్రభుత్వానికి గ్రూప్‌-1కు ఎంపికైన అభ్యర్థుల విజ్ఞప్తి

హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1కు ఎంపికైన వారికి జాప్యం చేయకుండా నియామకపత్రాలు అందించాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. మూడేళ్ల క్రితం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి ఎంతో కష్టించామని, రెండు సార్లు పరీక్షల రద్దు, మళ్లీ నిర్వహణ తర్వాత ఎట్టకేలకు తుది జాబితా విడుదలైనా నియామక ప్రక్రియ పూర్తికావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్‌-1 పోస్టులకు ఎంపికైనవారు ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత కొందరు ఉద్దేశపూర్వకంగా కోర్టులో కేసులు వేసి కావాలని అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ నియామక ప్రక్రియలో జాప్యం జరిగితే గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టుల భర్తీపైనా ప్రభావం పడుతుందని, బ్యాక్‌లాగ్‌ పోస్టులు పెద్దసంఖ్యలో మిగిలిపోతాయన్నారు. పరీక్షలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పూర్తి పారదర్శకతతో నిర్వహించిందని, ఎలాంటి అవకతవకలు, అక్రమాలకు అవకాశమే లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నియామకపత్రాలు అందించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jun 23 , 2025 | 04:41 AM