Bhatti Vikramarka: మెడికల్ రీయింబర్స్ బిల్లులకు ఆమోదం
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:52 AM
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు అందించింది. రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల మెడికల్ రీ-యింబర్స్‌మెంట్ బిల్లులను క్లియర్ చేసింది.

ఒకేసారి రూ.180 కోట్లు విడుదల చేసిన డిప్యూటీ సీఎం
రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటికీ మోక్షం
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు అందించింది. రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల మెడికల్ రీ-యింబర్స్‌మెంట్ బిల్లులను క్లియర్ చేసింది. దీంతో బిల్లుల క్లియరెన్స్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బిల్లులకు సంబంధించి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒకేసారి రూ.180.38 కోట్లను విడుదల చేశారు. రైతు భరోసా కింద ప్రభుత్వం తొమ్మిది రోజుల వ్యవధిలోనే రూ.9 వేల కోట్ల సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఉద్యోగుల మెడికల్ రీ-యింబర్స్‌మెంట్ బిల్లులను కూడా క్లియర్ చేయడం గమనార్హం.
ఒకవైపు తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నా.. సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేయాల్సి ఉన్నా.. ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీ-యింబర్స్‌మెంట్ బిల్లుల క్లియరెన్స్‌కు రూ.180 కోట్లను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబంగా భావించి, వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఉద్యోగులు, అధికారుల సమస్యల పరిష్కారానికి సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుందని, త్వరలోనే కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఆరోగ్య బీమా పథకం కూడా సిద్ధమవుతోందని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News