Share News

Metro Heritage Tussle: చారిత్రక కట్టడాలను కూల్చట్లేదు

ABN , Publish Date - Apr 18 , 2025 | 04:56 AM

పాతబస్తీ మెట్రో పనుల్లో చారిత్రక కట్టడాలను కూల్చడం లేదని ప్రభుత్వం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలిపింది

Metro Heritage Tussle: చారిత్రక కట్టడాలను కూల్చట్లేదు

  • పాతబస్తీలో మెట్రోపై హైకోర్టుకు ప్రభుత్వ వివరణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): మెట్రో రెండో దశ ఆరో కారిడార్‌లో భాగంగా ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకూ చేపడుతున్న పనుల్లో చారిత్రక కట్టడాలను కూల్చేయట్లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. మెట్రో కోసం చార్మినార్‌ నుంచి ఫలక్‌నుమా దాకా ఉన్న చారిత్రక కట్టడాలను కూల్చేస్తున్నారని.. హెరిటేజ్‌ ఇంపాక్ట్‌ అసె్‌సమెంట్‌ చేపట్టకుండా, నిపుణుల కమిటీ వేయకుండా నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొంటూ యాక్ట్‌ పబ్లిక్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ సంస్థ అధ్యక్షుడు మొహమ్మద్‌ రహీంఖాన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుకతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ వాదిస్తూ.. వాటికి ఎలాంటి నష్టం కలిగించట్లేదని తెలిపారు. నిబంధనల ప్రకారం స్థలాలు సేకరించిన తర్వాతే నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మెట్రో నిర్మాణ పనులపై పూర్తిస్థాయి వివరాలు తెలియజేస్తూ కౌంటర్‌ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. దీంతో కోర్టు తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకూ.. చారిత్రక కట్టడాలుగా గుర్తించిన నిర్మాణాలను కూల్చరాదని స్పష్టంచేసింది.

Updated Date - Apr 18 , 2025 | 04:56 AM