Share News

Cotton Scam Inquiry: జిన్నింగ్‌ మిల్లర్లు, సీసీఐ అధికారుల మిలాఖత్‌

ABN , Publish Date - Apr 29 , 2025 | 03:25 AM

పత్తి విక్రయాల నకిలీ ధ్రువపత్రాలు జారీ చేసి అక్రమ లాభాలు పొందిన జిన్నింగ్‌ మిల్లర్లు, సీసీఐ అధికారులు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులు విచారణలో చిక్కుకున్నారు. 60 వేల నకిలీ ధ్రువపత్రాలను ఉపయోగించి, సాగు స్థలాన్ని పెంచి, భారీ లాభాలను సొంతం చేసుకున్నారు

Cotton Scam Inquiry: జిన్నింగ్‌ మిల్లర్లు, సీసీఐ అధికారుల మిలాఖత్‌

  • రైతుల పేర్లతో సీసీఐకి పత్తి అమ్మిన జిన్నింగ్‌ మిల్లర్లు

  • నకిలీ రైతులకు ధ్రువపత్రాలు జారీ

  • తాత్కాలిక రిజిస్ట్రేషన్ల పేరిట దందా

  • ‘విజిలెన్స్‌’ విచారణలో వెలుగులోకి

  • రైతులకు బదులు మిల్లర్లకు లబ్ధిపై ప్రభుత్వం సీరియస్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): వారికి గుంట భూమి లేదు. పత్తి పంట సాగుచేసింది లేదు. అసలు వాళ్లు రైతులే కాదు. జిన్నింగ్‌ మిల్లుల్లో పనిచేసే కూలీలు, సిబ్బంది, ట్రేడర్లు, బ్రోకర్లు, వారి పరిచయస్తులు.. ఇలా ఎవరు దొరికితే వారి పేర్లమీద భారత పత్తి సంస్థ (సీసీఐ)కు పత్తి విక్రయించిన నకిలీల బాగోతం బట్టబయలవుతోంది. తాత్కాలిక ధ్రువపత్రాల పేరిట సీసీఐకి పత్తి అమ్మిన జిన్నింగ్‌ మిల్లర్లు ఎవరో వెతికే పనిలో విజిలెన్స్‌ అధికారులు నిమగ్నమయ్యారు. రైతుల నుంచి తక్కువ ధరకు పత్తి కొని, కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు సీసీఐకి అమ్మేసి అక్రమార్కులు లాభపడ్డారు. ఇందుకు వ్యవసాయ శాఖ జారీ చేసిన 60 వేల సాగు ధ్రువీకరణ పత్రాలే కారణం కావటం గమనార్హం. పత్తి రైతులకు బదులుగా జిన్నింగ్‌ మిల్లర్లు, బ్రోకర్లకు లబ్ధి కలగటం, ఎమ్మెస్పీ వారికే లభించటం, పెద్దఎత్తున అక్రమ కొనుగోళ్లు జరగటంపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణ జరిపిస్తోంది. కౌలు, పోడు రైతులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు డిజిటల్‌ సిగ్నేచర్‌ కాని రైతులు పంటలు సాగు చేస్తే వారికి ఏఈవోలు సాగు ధృవీకరణ పత్రాలు జారీ చేస్తారు.


ఏఈవోలు జిన్నింగ్‌ మిల్లర్లతో కుమ్మక్కై... రైతులు కానివారికి ఈ పత్రాలు జారీ చేశారు. వీటి ఆధారంగా మార్కెటింగ్‌ శాఖ అధికారులు తాత్కాలిక ధ్రువపత్రాలు (టీఆర్‌లు) జారీ చేశారు. వీటితోనే పత్తి కొనుగోళ్లలో దందా చేశారు. టీఆర్‌లలో సాగు విస్తీర్ణాన్ని కూడా మార్చేశారు. ఉదాహరణకు 3 ఎకరాలకు టీఆర్‌ తీసుకుని 8 ఎకరాలుగా, ఒక ఎకరానికి టీఆర్‌ను 10 ఎకరాలుగా దిద్దేశారు. ఒక ఎకరం పేరుమీద 12 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొంటుంది. అంటే 10 ఎకరాలకు ధ్రువపత్రం ఉంటే 120 క్వింటాళ్ల పత్తిని సీసీఐకి అమ్ముకోవచ్చు. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు జారీ చేసిన 60 వేల తాత్కాలిక ధ్రువపత్రాల్లో సగానికంటే ఎక్కువ నకిలీ రైతుల పేరిట తీసుకున్నవేనని ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిసింది. గత అక్టోబరు నెలలో (దిపావళి సమయంలో) హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో జిన్నింగ్‌ మిల్లర్లు, సీసీఐ అధికారులు, సిబ్బందితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. విందు, వినోదాలతో పాటు అక్రమ కొనుగోళ్లపై అక్కడే చర్చలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.


అక్రమాలపై ప్రభుత్వం సీరియస్‌

ఈ అక్రమాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ కొనుగోళ్లలో మార్కెటింగ్‌ శాఖ అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు విచారణాధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఏడుగురు మార్కెట్‌ కార్యదర్శులపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. 134 మందికి మెమోలు జారీ చేసింది. విజిలెన్స్‌ విచారణ కొలిక్కివస్తే... జిన్నింగ్‌ మిల్లర్లు, సీసీఐ అధికారులు, సిబ్బంది, బ్రోకర్లు, ట్రేడర్లు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారుల బండారం బయటపడే అవకాశాలున్నాయి. ఒక్కో క్వింటాలు పత్తిపై జిన్నింగ్‌ మిల్లర్లు రూ.500 వరకు సొమ్ము చేసుకున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Updated Date - Apr 29 , 2025 | 03:25 AM