Birth Certificate: ఫోన్ నుంచే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు!
ABN , Publish Date - Aug 04 , 2025 | 05:23 AM
అవకతవకలకు ఆస్కారం లేని, పారదర్శకంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే నూతన విధానం అమలుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు వేగవంతం చేసింది.

నమోదు, సవరణ, డౌన్‌లోడ్‌కు అవకాశం.. నకిలీలకు చెక్.. పారదర్శకంగా సేవలు
కొత్త విధానంపై జీహెచ్‌ఎంసీ కసరత్తు
కేంద్ర ప్రభుత్వ సీఆర్‌ఎ్‌స-ఓఆర్‌జీఐ అనుసంధానానికి ప్రతిపాదనలు
సర్కారు ఆమోదిస్తే అందుబాటులోకి..
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అవకతవకలకు ఆస్కారం లేని, పారదర్శకంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే నూతన విధానం అమలుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు వేగవంతం చేసింది. మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండా మొబైల్, వెబ్ ద్వారా పౌరులు నేరుగా సర్టిఫికెట్ల కోసం నమోదు, సవరణకు దరఖాస్తు, డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించేలా అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తోంది. నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి చెక్ పెట్టడంతో పాటు సంబంధిత అధికారి పరిశీలన అనంతరమే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం (ఓఆర్‌జీఐ) పరిధిలోని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్‌ఎ్‌స)లోకి మారాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే పురపాలక శాఖ ఆమోదం తెలుపగా సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఈ ఫైల్ డైరెక్టర్ హెల్త్ (డీహెచ్) నుంచి వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి వెళ్లిందని, అక్కడి నుంచి సర్కారుకు పంపాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఏటా జీహెచ్‌ఎంసీ పరిధిలో 2 లక్షల వరకు జననాలు, 60 వేల నుంచి 70 వేల వరకు మరణాలు నమోదవుతున్నాయి.
మెరుగైన పౌరసేవల కోసమంటూ గతంలో తక్షణ ఆమోదం అవకాశాన్ని కల్పించారు. దీన్ని కొన్ని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు, జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు దుర్వినియోగం చేశారు. సుమారు 26 వేల నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఈ తరహా అక్రమాలకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌తో అనుసంధానం కావాలని రెండున్నరేళ్లుగా జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ సర్కారు వచ్చాక ప్రతిపాదన తిరిగి తెరపైకి వచ్చింది. జనన, మరణాల నమోదుకు ఓఆర్‌జీఐ దేశమంతటా ఏకీకృత సాఫ్ట్‌వేర్ వినియోగిస్తోంది. ఇప్పటికే దీనిని ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాంకేతిక సేవలు అందిస్తోంది. ఆ సంస్థకు జీహెచ్‌ఎంసీ ఏటా రూ.5 కోట్ల వరకు చెల్లిస్తోంది. సీఎ్‌సఆర్-ఓఆర్‌జీఐ సాంకేతిక సేవలను ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
ఇవీ ప్రయోజనాలు
పౌరులు మొబైల్, వెబ్ ద్వారా జనన, మరణాల నమోదు, సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం.
మీ సేవా కేంద్రాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
ఆధార్ నంబర్ ఆధారంగా నకిలీ జనన పత్రాల జారీని నిరోధించవచ్చు.
సెంట్రలైజ్డ్ డ్యాష్ బోర్డు ద్వారా రియల్ టైం ట్రాకింగ్‌కు అవకాశం. దరఖాస్తు ఎవరి వద్ద ఉందనేది పౌరులు తెలుసుకోవచ్చు.
సర్వీస్ కమిషన్లు, క్రీడా విభాగాలు వయస్సు నిర్ధారణ కోసం సీఎ్‌సఆర్-ఓఆర్‌జీఐలోని డేటాను పరిశీలించే వెసులుబాటు.
పాస్‌పోర్టు, ఉద్యోగాలు, పాఠశాలల అడ్మిషన్లు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలోనూ సర్టిఫికెట్లు వినియోగం/పరిశీలనకు అవకాశం.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..
ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన
Read latest Telangana News And Telugu News