Adilabad: గ్యాస్ సిలిండర్ లీక్.. చెలరేగిన మంటలు
ABN , Publish Date - Aug 04 , 2025 | 05:32 AM
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పిప్పిల్‌దరి గ్రామంలో వంటగ్యాస్ సిలిండర్ లీకయ్యి మంటలు చెలరేగడంతో ఏడుగురు గాయపడ్డారు.

ఒకే కుటుంబంలో ఏడుగురికి గాయాలు
ముగ్గురి పరిస్థితి విషమం.. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన
బోథ్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పిప్పిల్‌దరి గ్రామంలో వంటగ్యాస్ సిలిండర్ లీకయ్యి మంటలు చెలరేగడంతో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గ్రామానికి చెందిన తొడసం సోనేరావు అనే వ్యక్తి భార్య ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పైపు లీక్ అయింది. పైపును సరిచేసే క్రమంలో మంటలు చెలరేగి సోనేరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది చూసిన ఆయన కుమారుడు గంగాప్రసాద్, తమ్ముడు బాబురావు ఇంట్లోకి వెళ్లగా.. వారికీ మంటలు అంటుకున్నాయి.
అలాగే సోనేరావు భార్య లక్ష్మి, మరో తమ్ముడు లక్ష్మణ్, కుమారుడు శేఖర్‌లు సాయం చేయడానికి ప్రయత్నించిగా వారికీ మంటలు అంటుకున్నాయి. ఇంటి పక్కన ఉన్న మహేశ్ కూడా వీరిని కాపాడే ప్రయత్నంలో స్పల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ గ్రామస్థులు వెంటనే బోథ్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం, తీవ్ర గాయాలపాలైన సోనేరావు, గంగాప్రసాద్, బాపురావులను మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్థానిక ఎస్సై శ్రీసాయి ఆరా తీశారు.