Ram Charan: గేమ్ చేంజర్ ఆన్‌లైన్‌లో పెడతామంటూ బ్లాక్‌మెయిల్
ABN , Publish Date - Jan 14 , 2025 | 03:58 AM
రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమాను లీక్ చేసి ఆన్‌లైన్ పెడతామని కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ చిత్ర యూనిట్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్
విడుదల రోజే సోషల్ మీడియాలో లీక్
సైబర్ క్రైమ్‌లో చిత్ర యునిట్ ఫిర్యాదు
రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమాను లీక్ చేసి ఆన్‌లైన్ పెడతామని కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ చిత్ర యూనిట్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సినిమా విడుదలకు వారం రోజుల ముందు నుంచే కొంతమంది దుండగులు సినిమా నిర్మాతతో పాటు చిత్ర యూనిట్‌లోని ప్రముఖులకు ఫోన్‌లు చేసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారని ఫిర్యాదు చేశారు. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతూ భారీగా డబ్బులు డిమాండ్ చేశారు.
రిలీజ్‌కు రెండు రోజుల ముందు సినిమాలోని కీలక సన్నివేశాలను లీక్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా రిలీజ్ అయిన రోజే హెచ్‌డీ ప్రింట్‌ను లీక్ చేసి సోషల్ మీడియాలో పెట్టినట్లు తెలిపారు. 45 మంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి, గేమ్ చేంజర్ సినిమాను పథకం ప్రకారమే లీక్ చేసి, ఇబ్బందులు సృష్టించి బ్లాక్‌మెయిల్ చేశారని చిత్ర యూనిట్ గుర్తించింది. ఈ ముఠా వెనుక ఎవరో బలమైన వ్యక్తి ఉండి ఇదంతా నడిపిస్తున్నట్లు అనుమానించిన చిత్ర బృందం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
-ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ/ సినిమాడెస్క్