Land Forgery: 125 ఎకరాలకు టోకరా!
ABN , Publish Date - Jul 18 , 2025 | 05:58 AM
చనిపోయిన వ్యక్తి సంతకం ఫోర్జరీ చేసి, 125 ఎకరాల భూమిని కాజేసేందుకు యత్నించిన వారి గుట్టు రట్టయింది. దత్తపుత్రులమని చెప్పుకొంటూ మృతుడి సంతకాన్ని ఫోర్జరీ చేశారని దాయాదులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది.

మృతుడి సంతకం ఫోర్జరీతో నకిలీ వీలునామా
దత్తపుత్రులమంటూ భూమి కాజేసే యత్నం
దాయాదుల ఫిర్యాదుతో అక్రమార్కుల గుట్టురట్టు
భార్యాభర్తల రిమాండ్.. పరారీలో ఏడుగురు
చేవెళ్ల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): చనిపోయిన వ్యక్తి సంతకం ఫోర్జరీ చేసి, 125 ఎకరాల భూమిని కాజేసేందుకు యత్నించిన వారి గుట్టు రట్టయింది. దత్తపుత్రులమని చెప్పుకొంటూ మృతుడి సంతకాన్ని ఫోర్జరీ చేశారని దాయాదులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. చేవెళ్ల పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన పట్లోళ్ల ప్రతా్‌పరెడ్డికి 125 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయనకు పిల్లలు లేరు. 2018 అక్టోబరు 9న అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన భార్య అంతకంటే ముందే చనిపోయారు. ఈ క్రమంలో ప్రతా్‌పరెడ్డి తనను దత్తత తీసుకున్నారని, ఆయన మరణానంతరం ఆస్తిపాస్తులు తనకు, తన భార్య సురేఖకు దక్కుతాయంటూ మహబూబ్‌నగర్ జిల్లా నందారం గ్రామానికి చెందిన గుమ్మల జగన్‌మోహన్‌రెడ్డి కోర్టులో సివిల్ కేసు వేశారు. ప్రతాప్‌రెడ్డి బతికుండగానే 2017 డిసెంబరు 3న ఆయన రాసినట్లుగా వీలునామా సృష్టించారు.
ప్రతాప్‌రెడ్డి మృతిచెందాక దాన్ని తెరపైకి తెచ్చారు. భూములను తమపేరిట బదలాయించుకోవడంతోపాటు చేవెళ్ల ఎస్బీఐలో ప్రతా్‌పరెడ్డి పేరిట ఉన్న రూ.19 లక్షలకుపైగా నగదును సైతం తీసుకున్నారు. ప్రతా్‌పరెడ్డి అన్నదమ్ముల పిల్లలు పట్లోళ్ల మహేశ్‌కుమార్‌రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి (ఆర్మీ రిటైర్డ్), నరేశ్‌కుమార్‌రెడ్డి, హేమలతలు ఆరా తీయగా ఈ బాగోతం బయటపడింది. ఆయన ఎవరినీ దత్తత తీసుకొలేదని, నకిలీ వీలునామా సృష్టించారని వారు కోర్టును ఆశ్రయించారు. 2023లో చేవెళ్ల కోర్టు ఆదేశాలతో జగన్‌మోహన్‌రెడ్డి, సురేఖతో పాటు అతని సోదరులపై కేసు నమోదైంది. ప్రతా్‌పరెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఫోరెన్సిక్ పరీక్షలో తేలింది. దీంతో జగన్‌మోహన్‌రెడ్డి జంటతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి, సురేఖను అరెస్టు చేసి సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. కేసులో మిగతా నిందితులు పరారీలో ఉండగా.. గుమ్మల మధుసూదన్‌రెడ్డి (న్యాయవాది)పై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని చేవెళ్ల ఎస్సై సంతో్‌షరెడ్డి తెలిపారు.