Share News

Dharani Portal: ‘ధరణి’పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ షురూ!

ABN , Publish Date - Jun 17 , 2025 | 05:26 AM

ధరణి పోర్టల్‌ ఆధారంగా జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ మొదలు కానుంది. కేరళ ప్రభుత్వ సంస్థ అయిన కేరళ సెక్యూరిటీ ఆడిట్‌ అండ్‌ అస్యూరెన్స్‌ (కేఎస్‌‌ఏఏసీ) ఈ ఆడిట్‌ నిర్వహించనుంది.

Dharani Portal: ‘ధరణి’పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ షురూ!

  • కేరళ ప్రభుత్వ సంస్థ కేఎస్‌‌ఏఏసీకి బాధ్యతలు

  • సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఆడిట్‌

  • ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. 25ు రాయితీతో ఈనెల 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

హౖదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌ ఆధారంగా జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ మొదలు కానుంది. కేరళ ప్రభుత్వ సంస్థ అయిన కేరళ సెక్యూరిటీ ఆడిట్‌ అండ్‌ అస్యూరెన్స్‌ (కేఎస్‌‌ఏఏసీ) ఈ ఆడిట్‌ నిర్వహించనుంది. 2020 అక్టోబరు నుంచి 2023 డిసెంబరు వరకు జరిగిన ధరణి లావాదేవీలు, ముఖ్యంగా హైదరాబాద్‌ హెచ్‌ఎండీఏ పరిధిలో నిషేధిత జాబితాలోని భూములను సాఫ్ట్‌వేర్‌ను అనుకూలంగా మార్చుకొని రాత్రికి రాత్రే అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న వ్యవహారంపై శాస్ర్తీయ కోణంలో విచారణ చేయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విదేశీ సంస్థలు కాకుండా స్వదేశీ సంస్థల ద్వారానే ఆడిట్‌ చేయాలని టెండర్లు పిలిచింది. నాలుగు సంస్థలు టెండర్లలో పాల్గొనగా.. కేరళకు చెందిన కేఎ్‌సఏఏసీ వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. సెక్యూరిటీ ఆడిట్‌, ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కోసం రెవెన్యూ రికార్డులను అప్పగించాలని సదరు సంస్థ కోరగా.. రికార్డుల గోప్యత గురించి హామీనివ్వాలని ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలోనే ఆడిట్‌ నిర్వహణకు రూ.80 లక్షలకు పైగా ఖర్చవుతుందని కేఎ్‌సఏఏసీ కోట్‌ చేయగా.. అంత మొత్తం ఇవ్వలేమని.. పునఃపరిశీలన చేసి మరో ప్రతిపాదన ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. దీనిపై ఆ సంస్థ రెవెన్యూ మంత్రి, ఉన్నతాధికారులతో పలుమార్లు భేటీ అయింది. తొలుత రెండు చిన్న జిల్లాలను ఎంపిక చేసుకుని.. వచ్చిన ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఆడిట్‌ చేయాలని ప్రభుత్వం సూచించింది. దీంతో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసేందుకు కేఎ్‌సఏఏసీ సిద్ధమైనట్లు తెలిసింది. అందుకు అవసరమైన రికార్డులను సీసీఎల్‌ఏ అధికారులు సంస్థకు అందించినట్లు సమాచారం.


లక్షల ఎకరాలు చేతులు మారినట్లు ఆరోపణలు

2014-2023 మధ్య కాలంలో లక్షలాది ఎకరాల అటవీ, దేవాదాయ, వక్ఫ్‌, భూదాన్‌ భూములు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో అసైన్డ్‌ భూములు 22.68 లక్షల ఎకరాలుండగా.. ఇవి కూడా మాయమైపోయాయి. 2017 సెప్టెంబరు భూరికార్డుల నవీకరణకు ముందు పట్టా భూములు 1.30 కోట్ల ఎకరాలుంటే 2020 అక్టోబరు 23 నాటికి ఈ లెక్క 1.55 కోట్ల ఎకరాలకు చేరింది. పట్టా భూముల జాబితాలో ఏకంగా 25 లక్షల ఎకరాలు అదనం గా రికార్డయింది. ఈ 25 లక్షల ఎకరాలు అటవీ భూములా లేక దేవాదాయ భూములా, వక్ఫ్‌ భూములా అనేది తేలాలంటే ఫోరెన్సిక్‌ ఆడిట్‌ తప్పనిసరని ప్రభుత్వం భావించింది. భూముల లెక్కలపై అనేక అనుమానాలున్నా రికార్డుల నవీకరణ అనంతరం 2020లో ధరణి పోర్టల్‌లోకి ఎక్కించేశారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరిగిపోయాయి. లెక్క తేలని ప్రభుత్వ, అటవీ, దేవాదాయ, అసైన్డ్‌ భూముల వివరాలు చూసుకోకుండా మ్యుటేషన్‌ చేసేయాలని గత ప్రభుత్వం నిర్ణయించడంతో ఆయా భూములు శాశ్వతంగా అటవీ, దేవాదాయ, వక్ఫ్‌ రికార్డుల నుంచి కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తిందనే వాదన ఉంది. వందల ఎకరాల భూదాన్‌ భూముల రికార్డులు ట్యాంపర్‌ అయినట్లు వార్తలు రావడంతో.. ఆ వివరాలను తేల్చేందుకు ప్రస్తుతం సీసీఎల్‌ఏలో ఓ అధికారిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2023 కాంగ్రెస్‌ అధికారం చేపట్టే వరకు అర్ధరాత్రి జరిగిన రిజిస్ట్రేషన్ల నుంచి భూములు ఎవరి చేతుల్లోకి మారాయో ఆ వివరాలు ప్రజల ముందు పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.


డిసెంబరు నాటికి పూర్తి..

కేఎస్‌‌ఏఏసీ రెండు జిల్లాల ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదికను 4 నెలల్లో ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలిసింది. ధరణి పోర్టల్‌ నిర్వహణ చేపట్టిన టెర్రాసిస్‌ సంస్థ ఇచ్చిన రికార్డుల ఆధారంగా ఆడిట్‌ చేయనున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని 4 నెలల్లో ముగించి.. ఆ తరువాత రెండు, మూడు నెలల్లో మిగిలిన జిల్లాల్లో ఉన్న భూ రికార్డులను ఆడిట్‌ చేయనున్నట్లు తెలిసింది. మొత్తం మీద డిసెంబరు నాటికి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించేలా కేరళ సంస్థ ప్రతిపాదనలు ఇచ్చినట్లు సమాచారం.

Updated Date - Jun 17 , 2025 | 05:26 AM