Floodwaters Surge In Srisailam: శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద
ABN , Publish Date - Aug 01 , 2025 | 05:25 AM
కృష్ణా బేసిన్‌లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి

ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 3.17లక్షల క్యూసెక్కుల రాక
నాగార్జున సాగర్‌కు 2.82 లక్షల క్యూసెక్కుల పైనే వరద
ఆల్మట్టి నుంచి పులిచింతల దాకా అన్నీ ఫుల్
హైదరాబాద్/గద్వాల/నాగార్జునసాగర్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్‌లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3.17 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 3.18 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు (215.80 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 882.70 అడుగుల (202.96టీఎంసీల) మేర నీరు ఉంది. కృష్ణా బేసిన్‌లో ఆల్మట్టి నుంచి పులిచింతల దాకా ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.52లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఔట్‌ఫ్లో 1.40లక్షల క్యూసెక్కులుగా ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు 1.35లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే... ఔట్‌ఫ్లో 1.08లక్షల క్యూసెక్కులుగా రికార్డయింది. జూరాలకు 2.01లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా...జలవిద్యుదుత్పత్తి, గేట్లు ఎత్తడం ద్వారా 2.08 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిపెడుతున్నారు. తుంగభద్రకు 40వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... 32వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 2.82లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 2.43లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. పులిచింతలకు 2.14 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 2.04లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులు (312.04 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 585.10 అడుగులు(297.7టీఎంసీల) మేర నీరు ఉంది. మరికొన్ని రోజులపాటు వరద కొనసాగే అవకాశం ఉంద ని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 55 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 37.63 టీఎంసీల నీరు నిల్వ ఉంది.