Krishna Projects: నెమ్మదించిన కృష్ణమ్మ పరవళ్లు
ABN , Publish Date - Aug 04 , 2025 | 04:18 AM
కృష్ణా ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుతోంది. దీంతో ఒక్కొక్కటిగా ప్రాజెక్టుల గేట్లను అధికారులు మూసివేస్తున్నారు.

శ్రీశైలం, సాగర్ గేట్ల మూసివేత
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
గద్వాల/నాగార్జునసాగర్/మహదేవపూర్ రూరల్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కృష్ణా ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుతోంది. దీంతో ఒక్కొక్కటిగా ప్రాజెక్టుల గేట్లను అధికారులు మూసివేస్తున్నారు. ఆదివారం ఆల్మట్టి, శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లు మూసుకోగా, ఆయా ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.19 లక్షల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా 66,297 క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 199.27 టీఎంసీల నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌కు 47,592 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. విద్యుదుత్పత్తి, కాల్వలకు అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలకు ప్రస్తుతం అందులో 300 టీఎంసీలున్నాయి. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. 1.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 85 గేట్లను ఎత్తి అంతే నీటిని దిగువకు పంపిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
సాగర్‌లో పర్యాటకుల సందడి
నాగార్జునసాగర్ అందాలను తిలకించేందుకు ఆదివారం భారీగా పర్యాటకులు తరలివచ్చారు. దీంతో సాగర్ ఫైలాన్ కాలనీ కొత్త వంతెన నుంచి ప్రధాన జలవిద్యుత్తు కేంద్రం వెళ్లే రహదారిలో, అలాగే బైపాస్ రోడ్డులో 3 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ నిలిచింది. దీంతో పోలీసులు శ్రమించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అయితే ఉదయం 11 గంటలకే ప్రాజెక్టు గేట్లన్నీ మూసేయడంతో ఎక్కువ మంది లాంచీ ప్రయాణానికి ఆసక్తి చూపారు. జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు లాంచీలో వెళ్లారు. సాధారణ రోజుల్లో ఒకటి లేదా రెండు లాంచీ ట్రిప్పులు నడుస్తుండగా, ఆదివారం ఆరు ట్రిప్పులు నడిపారు. బుద్ధవనానికి కూడా పర్యాటకులు అఽధిక సంఖ్యలో వచ్చినట్లు బుద్ధవనం అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..
ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన
Read latest Telangana News And Telugu News