Share News

CPI Party Violence:ఆర్థిక వివాదాల వల్లే... చందు రాథోడ్‌ హత్య

ABN , Publish Date - Jul 20 , 2025 | 03:17 AM

ఆర్థిక లావాదేవీలు, పార్టీలో ఆధిపత్య పోరుతోపాటు తన భార్యతోవివాహేతర సంబంధమున్నట్లుగా చెబుతూ

CPI Party Violence:ఆర్థిక వివాదాల వల్లే... చందు రాథోడ్‌ హత్య
CPI Party Violence

  • పార్టీలో ఆధిపత్యపోరుతో పాటు తన భార్యతో వివాహేతర సంబంధం ఉందనడమే కారణం

  • విచారణలో ప్రధాన నిందితుడి వెల్లడి

చాదర్‌ఘాట్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక లావాదేవీలు, పార్టీలో ఆధిపత్య పోరుతోపాటు తన భార్యతోవివాహేతర సంబంధమున్నట్లుగా చెబుతూ అనుచరులను తనవైపు తిప్పుకుంటున్నాడన్న కారణంతో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు కెతావత్‌ చందు రాథోడ్‌ను హత్య చేయించినట్లుగా ప్రధాన నిందితుడు దొంతి రాజేష్‌ వెల్లడించినట్లు సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ చైతన్యకుమార్‌ తెలిపారు. చందు రాథోడ్‌ హత్య కేసులో అరెస్ట్‌ చేసిన ఐదుగురు నిందితులను సైదాబాద్‌ పోలీసు స్టేషన్‌లో మీడియా ముందుంచారు. డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం నర్సాయిపల్లికి చెందిన చందు రాథోడ్‌ (50) దిల్‌సుఖ్‌నగర్‌ చైతన్యపురిలోని ద్వారకాపురి కాలనీలో ఉంటున్నారు. ఈ నెల 15న జనగాం జిల్లా సీతారాంపురం గ్రామానికి చెందిన దొంతి రాజేష్‌ అలియాస్‌ రాజన్న(48) తన ఐదుగురు అనుచరులతో కలిసి ముసారాంబాగ్‌ శాలివాహననగర్‌ కాలనీలోని చందు రాథోడ్‌ వాకింగ్‌కు వెళ్లి వస్తుండగా తుపాకులతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈయన హత్యకు భూపేష్‌ గుప్తా కుంబ ఏడుకొండలు, శ్రీను అలియాస్‌ నాగరాజు, కందులూరి ప్రశాంత్‌, ఏపీకి చెందిన అర్జున్‌ జ్ఞానప్రకాష్‌, లింగిబేడి రాంబాబులు దొంతి రాజేశ్‌‌కు సహకరించినట్టు డీసీపీ తెలిపారు. వీరిలో శ్రీను పరారీలో ఉన్నాడని, మిగతా ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. హయత్‌నగర్‌లోని కుంటూర్లులో గల దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ స్థలంలో సుమారు 1,300 వరకు సీపీఐ తరఫున నిరుపేద కుటుంబాలకు గుడిసెలు వేయించారు. ఒక్కో గుడిసె నుంచి సుమారు రూ.వెయ్యి చొప్పున రూ.13 లక్షల వరకు చందు రాథోడ్‌ వసూలు చేశాడు. ఇందులోంచి రాజేశ్‌కు చందు డబ్బులు ఇవ్వకపోవడంతోపాటు అతని భార్యతో తనకు వివాహేతర సంబంధమున్నట్టుగా చెప్పుకుంటూ అనుచరులను రాజేశ్‌కు దూరం చేశాడు. దీంతో రాజేశ్‌.. చందు రాథోడ్‌ను హత్య చేసేందుకు మరో ఐదుగురితో కలిసి పథకం వేశాడు. 15న ముసారాంబాగ్‌ శాలివాహననగర్‌ కాలనీలోని జీహెచ్‌ఎంసీ పార్క్‌లో వాకింగ్‌ ముగించుకుని బయటికి వచ్చిన చందు రాథోడ్‌పై ముందు ప్రశాంత్‌ కళ్లలో కారం చల్లాడు. ఆ వెంటనే అర్జున్‌ జ్ఞానప్రకాష్‌, శ్రీను రెండు తుపాకులతో ఏడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో చందు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తులో సీసీ పుటేజీలు, కాల్‌డేటాతో పలువురిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు అర్జున్‌ జ్ఞానప్రకాష్‌, రాంబాబు అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యకు ప్రధాన సూత్రధారి రాజేశ్‌తో ఏడుకొండలు జనగామలో ఉన్నట్లు గుర్తించి వారిని పట్టుకున్నారు. ప్రశాంత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 03:17 AM