Share News

Domestic Violence: కన్నతండ్రి.. కర్కోటకుడై..!

ABN , Publish Date - Jul 24 , 2025 | 03:23 AM

బుద్ధిగా హోంవర్క్‌ చేసుకుంటున్న బాలిక పట్ల కన్నతండ్రి మూర్ఖంగా ప్రవర్తించాడు. అకారణంగా ఆమెను దండించాడు. భార్య అడ్డుపడినా పదే పదే చిన్నారి బిగ్గరగా రోదిస్తున్నా ఆమె ముఖంపై కాలుతో తన్నాడు.

Domestic Violence: కన్నతండ్రి.. కర్కోటకుడై..!

  • అకారణంగా చిన్నారి ముఖంపై కాలుతో తన్నుతూ దండన

  • భార్య వారించినా దుర్మార్గం.. ఆ వీడియో వాట్సాప్‌ స్టేట్‌సగా

  • నెట్‌లో వైరల్‌ అవడంతో వెలుగులోకి.. కేసు నమోదు

  • కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఘటన

బూర్గంపాడు, జూలై 23: బుద్ధిగా హోంవర్క్‌ చేసుకుంటున్న బాలిక పట్ల కన్నతండ్రి మూర్ఖంగా ప్రవర్తించాడు. అకారణంగా ఆమెను దండించాడు. భార్య అడ్డుపడినా పదే పదే చిన్నారి బిగ్గరగా రోదిస్తున్నా ఆమె ముఖంపై కాలుతో తన్నాడు! పైగా ఆ దృశ్యాలను తన వాట్సాప్‌ స్టేట్‌సగా పెట్టుకున్నాడు. కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో ఈ ఘటన జరిగింది. బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంకు చెందిన రమేశ్‌ అనే వ్యక్తి సారపాక ఐటీసీ కర్మాగారంలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని భార్య భవాని, కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. అతడి కూతురు నాలుగో తరగతి చదువుతోంది. ఈ నెల 20న బాలిక ఇంట్లో హోంవర్క్‌ చేసుకుంటుండగా పక్కన కుర్చీ వేసుకొని కూర్చొని.. ఆమెను కాలితో తన్నుతూ తీవ్ర భయభ్రాంతులకు గురిచేశాడు. భార్య అడ్డుపడగా ఆమెతో గొడవకు దిగాడు.


కూతురిని భర్త తన్నుతున్న దృశ్యాలను భార్య వీడియో తీసి.. దాన్ని అధికారులకు పంపుతానని అతడిని బెదిరించింది. అయితే.. ‘నువ్వేంటి అఽధికారులకు పంపేది?’అంటూ రెచ్చిపోయిన అతడు.. సెల్‌ఫోన్‌ను లాక్కుని ఆ వీడియోను తీసుకుని వాట్సాప్‌ స్టేట్‌సగా పెట్టుకున్నాడు. ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారగా.. కొందరు చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ నంబరుకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చారు. స్పందించిన ఆ అధికారులు ఐసీడీఎస్‌ అధికారులను అప్రమత్తం చేశారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సక్కుబాయి విచారణ జరిపి ఘటనపై మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేశ్‌పై జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశామని ఎస్సై ప్రసాద్‌ తెలిపారు. కాగా, ఘటన అనంతరం రమేశ్‌ భార్య కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. రమేశ్‌.. క్రికెట్‌ బెట్టింగులకు అలవాటుపడి అప్పులపాలయ్యాడని, మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవ పడుతుండేవాడని స్ధానికులు చెబుతున్నారు.

Updated Date - Jul 24 , 2025 | 03:23 AM