Share News

Father Kolombo Medical College: ఫాదర్‌ కొలంబో వైద్య కళాశాల గుర్తింపు రద్దు

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:32 AM

వరంగల్‌ జిల్లాలోని ఫాదర్‌ కొలంబో వైద్య కళాశాల గుర్తింపును జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) రద్దు చేసి, కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలను నిలిపివేసింది.

Father Kolombo Medical College: ఫాదర్‌ కొలంబో వైద్య కళాశాల గుర్తింపు రద్దు

  • కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలను నిలిపివేసిన ఎన్‌ఎంసీ

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ జిల్లాలోని ఫాదర్‌ కొలంబో వైద్య కళాశాల గుర్తింపును జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) రద్దు చేసి, కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలను నిలిపివేసింది. 150 సీట్లున్న ఆ కళాశాలకు రెండేళ్ల కిందటే ఎన్‌ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం కళాశాలలో రెండు ఎంబీబీఎస్‌ బ్యాచుల విద్యార్థులున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. కళాశాల గుర్తింపు రద్దు వెనుక గతంలో కళాశాలలో తనిఖీలకు వచ్చిన అధికారులకు యాజమాన్యం లంచం ఇచ్చిన కేసు ప్రభావం చూపిందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 30 వరకు ప్రైవేటు వైద్య కళాశాలలున్నాయి. వాటిలో రెండు కళాశాలలు గత ఏడాది డీమ్డ్‌ యూనివర్సిటీగా మారాయి. ఫాదర్‌ కొలంబో కళాశాల గుర్తింపు రద్దుతో ఈ ఏడాది మిగిలిన 27 కళాశాలల్లోని సీట్లకే కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది.


లంచం కేసు ప్రభావమే..

వైద్య కళాశాలల్లో తనిఖీలకు వచ్చిన ఎన్‌ఎంసీ బృందాలకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలు, మధ్యవర్తులు, ఎన్‌ఎంసీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు కళాశాలల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు లేకపోయినా.. తమ కళాశాలలకు అనుకూలంగా నివేదికలివ్వాలని మధ్యవర్తుల ద్వారా వాటి యాజమాన్యాలు ఎన్‌ఎంసీ అధికారులకు లక్షల్లో లంచాలు ముట్టజెప్పాయి. దానిపై గత నెల 30న సీబీఐ కేసు నమోదు చేసింది. అందులో తెలంగాణకు చెందిన పలు కళాశాలల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అందులో ఫాదర్‌ కొలంబో వైద్య కళాశాల కూడా ఉంది. కళాశాల ట్రస్టీ ఫాదర్‌ జోసెఫ్‌ కొమ్మారెడ్డి రెండు విడుతల్లో 20 లక్షలు, 46 లక్షల రూపాయల చొప్పున లంచం చెల్లించినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఆ కేసు ప్రభావంతోనే కళాశాల గుర్తింపు రద్దయిందని వైద్య వర్గాలు అనుమానిస్తున్నాయి. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో 36 మంది పేర్లుండగా, అందులో ఆరుగురు ఏపీ, తెలంగాణకు చెందిన వారున్నారు. తెలంగాణకు చెందిన ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్‌ రజనీరెడ్డి పేరును కూడా సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.

Updated Date - Jul 19 , 2025 | 04:32 AM