Share News

Farmers Issues: ధరణి దరఖాస్తుల ‘తిరస్కరణ’ ఫీజు కోసం అన్నదాతల పడిగాపులు

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:22 AM

ధరణి స్థానే గత ఏప్రిల్‌ 14 నుంచి అమల్లోకి వచ్చిన భూభారతి ద్వారా రైతులు సమస్యలు ఉచితంగానే పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Farmers Issues: ధరణి దరఖాస్తుల ‘తిరస్కరణ’ ఫీజు కోసం అన్నదాతల పడిగాపులు

  • రైతులు చెల్లించిన చలాన్‌ 110 కోట్లు

  • రెండేళ్లుగా ప్రభుత్వ ఖజానాలోనే..

హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ధరణి స్థానే గత ఏప్రిల్‌ 14 నుంచి అమల్లోకి వచ్చిన భూభారతి ద్వారా రైతులు సమస్యలు ఉచితంగానే పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ధరణి కింద దాఖలు చేసిన దరఖాస్తుల్లో తిరస్కరణకు గురైన వాటితోపాటు చెల్లించిన చలాన్‌ నగదు వెనక్కి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇందుకోసం మండలం, జిల్లా కలెక్టర్‌, వ్యక్తిగత పని మీద హైదరాబాద్‌ వెళ్లిన వారు.. సీసీఎల్‌ఏ వరకూ వెళ్లి తిరస్కరణకు గురైన దరఖాస్తుల చలాన్‌ నగదు తిరిగి తమకు చెల్లించాలని కోరుతున్నారు. అలా తిరస్కరణకు గురైన దరఖాస్తులతోపాటు రైతులు చెల్లించిన రూ.110 కోట్లపై చిలుకు నగదు రెండేళ్లుగా ప్రభుత్వం వద్దే ఉందని రెవెన్యూ వర్గాల మాట. సకాలంలో దరఖాస్తులు పరిష్కరించక పోగా, తమ నగదు చెల్లించకుండా తిప్పుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.


భూముల రిజిస్ట్రేషన్‌, నాలా, మ్యుటేషన్‌, తప్పుల సవరణ, పట్టాదార్‌ పాస్‌పుస్తకం, మిస్సింగ్‌ సర్వే నంబర్లు, విస్తీర్ణంలో సవరణలు తదితర సమస్యలపై రైతులు వివిధ మాడ్యూళ్ల కింద దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఆయా మాడ్యూళ్లతో సంబంధం లేకుండా ఉన్నాయంటూ రైతుల దరఖాస్తులు తిరస్కరించిన అధికారులు.. వాటిల్లో లోపాలు చెప్పేవారు కాదన్న విమర్శలున్నాయి. ఇటీవల ఓ జిల్లా రైతులు కోర్టు ఉత్తర్వుల ద్వారా తమకు రావాల్సిన రూ.8. లక్షల నగదు వసూలు చేసుకోవడం రెవెన్యూ శాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కానీ, చిన్న మొత్తం చలాన్‌ కట్టిన రైతులు కోర్టులకెళ్లలేక అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. 2023లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 2.45 లక్షల ‘ధరణి’ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

Updated Date - Jul 22 , 2025 | 04:22 AM