Mahabubabad: ధాన్యం తూర్పార పడుతూ.. వడదెబ్బతో కుప్ప కూలిన అన్నదాత
ABN , Publish Date - May 13 , 2025 | 05:53 AM
పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి వెళ్లిన రైతు వడదెబ్బతో కుప్పకూలాడు. ఐదు రోజులైనా పంటను కొనుగోలు చేయకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తూ ఎండదెబ్బతో ధాన్యం రాశిపైనే మృతిచెందాడు.

కొనుగోలు కేంద్రంలో ఽధాన్యం రాశిపైనే మృతి
మహబూబాబాద్ జిల్లా పోచంపల్లిలో ఘటన
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి వెళ్లిన రైతు వడదెబ్బతో కుప్పకూలాడు. ఐదు రోజులైనా పంటను కొనుగోలు చేయకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తూ ఎండదెబ్బతో ధాన్యం రాశిపైనే మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లిలో సోమవారం ఈ ఘటన జరిగింది. గంట్లకుంట గ్రామ శివారు రామోజీతండాకు చెంది న (60) రెండున్నర ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ నెల 8న వరి పంటను కోసి ధాన్యాన్ని పోచంపల్లిలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పోశాడు. అయితే, తేమ ఉందని ఆదివారం వరకు కొనుగోలు చేయలేదు. సోమవారం ఉదయం ధాన్యాన్ని తూర్పార పడుతున్న కిషన్ ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురై మృతి చెందాడు.
అందాల పోటీల్లో మునిగితేలుతున్న సీఎం: కేటీఆర్
వడదెబ్బకు తాళలేక రైతులు ధాన్యం కుప్పలపై చనిపోతుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి అందాల పోటీల్లో మునిగితేలుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం వర్షాలతో కళ్లముందే కొట్టుకుపోవడం, మరోవైపు మండుతున్న ఎండలను తట్టుకోలేక రైతులు బలవుతున్నారని పేర్కొన్నారు. పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి, రుణమాఫీ పేరిట మోసం చేసి, చివరికి పంటను కూడా కొనకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. వడదెబ్బతో చనిపోయిన కిషన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎంకు సోయి ఉంటే కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ములుగు కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
ములుగు కలెక్టరేట్ ఎదుట మొక్కజొన్న రైతులు సోమవారం ధర్నా చేశారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో పలు కంపెనీలతో ఒప్పందం చేసుకుని మొక్కజొన్న సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. పరిహారం కోసం రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. కేంద్ర స్థాయిలో సర్వే చేయించిన ప్రభుత్వం.. పరిహారం విషయాన్ని తేల్చకపోవడంతో రైతులు మళ్లీ రోడ్డెక్కారు. ఎకరాకు రూ.లక్షన్నర పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ సంపత్‌రావుకు వినతి పత్రం అందజేశారు.
వడదెబ్బతో ముగ్గురి మృతి
వడదెబ్బతో సోమవారం ముగ్గురు మృతి చెందారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులోని డబుల్‌బెడ్‌రూం కాలనీలో నివాసముంటున్న వెంగళి మల్లేశ్ (54), మాసాయిపేట మండలం పోతాన్‌పల్లి గ్రామానికి చెందిన దుర్గం బాలయ్య (44), జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వడ్డిచర్లకు చెందిన గండి పోచెల్లమ్మ(68) ఎండదెబ్బకు అస్వస్థతకు గురై చనిపోయారు.
ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
దుబ్బాకలో ఓ చేనేత కార్మికుడు బలవన్మరణం
జఫర్‌గడ్/గూడూరు/దుబ్బాక, మే 12 (ఆంధ్రజ్యోతి): చేసిన అప్పులు తీర్చలేని దుస్థితిలో ఇద్దరు రైతులు, ఓ చేనేత కార్మికుడు సోమవారం ఆత్మహత్య పాల్పడ్డారు. జనగామ జిల్లా జఫర్‌గడ్‌కు చెందిన కాలువ రాజు(40) మూడెకరాల భూమిలో పంటల సాగు కోసం అప్పులు చేశాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు రాజును ప్రశ్నించారు. మనస్తాపం చెందిన రాజు పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన బానోత్ హచ్య (50) అప్పులు తెచ్చి మిర్చి, వరి పంటలను సాగు చేయగా దిగుబడి సరిగ్గా రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక పొలంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ఘటనలో.. దుబ్బాకకు చెందిన చేనేత కార్మికుడు గొరిటాల బాల్‌రాజ్(55) చేనేత సహకార సంఘం లోను, మాస్టర్ వీవర్ వద్ద పని చేశాడు. అయితే, ఇటీవల ఉపాధి లేకపోవడం, అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో సోమవారం ఇంట్లో ఉరేసుకున్నాడు.