Share News

Adilabad: నకిలీ పోలీసుల ముఠా గుట్టు రట్టు

ABN , Publish Date - Jul 11 , 2025 | 05:53 AM

అదిలాబాద్‌ జిల్లాలో నకిలీ పోలీసుల గుట్టు రట్టు అయింది. పోలీసుల అవతారమెత్తి ప్రజలను మోసగిస్తూ, డబ్బు వసూళ్లకు పాల్పడుతోన్న ముఠాను అరెస్టు చేసినట్లు గురువారం జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు.

Adilabad: నకిలీ పోలీసుల ముఠా గుట్టు రట్టు

  • 4 రాష్ర్టాల్లో రూ.18 లక్షల వరకు మోసం

  • ఇచ్చోడ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు, నలుగురి అరెస్టు

ఆదిలాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): అదిలాబాద్‌ జిల్లాలో నకిలీ పోలీసుల గుట్టు రట్టు అయింది. పోలీసుల అవతారమెత్తి ప్రజలను మోసగిస్తూ, డబ్బు వసూళ్లకు పాల్పడుతోన్న ముఠాను అరెస్టు చేసినట్లు గురువారం జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. నకిలీ పోలీసుల రూపంలో ఐదుగురి సభ్యుల ముఠా.. నగల దుకాణాల యజమానులకు ఫోన్‌ చేసి బంగారం అమ్మకాలలో మోసాలకు పాల్పడుతున్నారని వారిపై బెదిరింపులకు దిగారని తెలిపారు. ఇచ్చోడ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సుమారుగా రూ.18 లక్షల వరకు మోసం చేసి వ్యాపారం చేశారని, అందులో నష్టాలు రావడంతో మళ్లీ మోసాలకు పాల్పడడం ప్రారంభించారని అన్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశామని.. ఒకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి ఒక బెలోనో కారు, బైక్‌, ఓ ఆటోతో పాటు బంగారం, వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కేసులు ఉన్నాయని ఎస్పీ మహాజన్‌ చెప్పారు.

Updated Date - Jul 11 , 2025 | 05:53 AM