Share News

Hyderabad: నిర్మలా సీతారామన్‌ ఏఐ వీడియోతో రూ.20.13 లక్షల దోపిడీ!

ABN , Publish Date - Jun 18 , 2025 | 06:25 AM

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గొంతుతో రూపొందించిన ఏఐ (కృత్రిమ మేధ) వీడియోతో హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యురాలిని బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లు ఆమె వద్ద రూ.20.13 లక్షలు కొట్టేశారు.

Hyderabad: నిర్మలా సీతారామన్‌ ఏఐ వీడియోతో రూ.20.13 లక్షల దోపిడీ!

  • ఆన్‌లైన్‌ ఇన్వెస్టిమెంట్‌ పథకం అంటూ మోసం

  • హైదరాబాద్‌ వైద్యురాలికి సైబర్‌ నేరగాళ్ల టోకరా

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గొంతుతో రూపొందించిన ఏఐ (కృత్రిమ మేధ) వీడియోతో హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యురాలిని బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లు ఆమె వద్ద రూ.20.13 లక్షలు కొట్టేశారు. హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన మహిళా వైద్యురాలి(71) వాట్సా్‌పకు కొద్ది నెలల క్రితం ఓ గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఫేస్‌బుక్‌ లింక్‌ వచ్చింది. వైద్యురాలు ఆ లింక్‌ను ఓపెన్‌ చేయగానే.. ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో అధిక లాభాలు పొందేందుకు గొప్ప పథకం అంటూ నిర్మలా సీతారామన్‌ చెబుతున్న విధంగా ఉన్న వీడియో ఉంది.


ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేసి పెట్టుబడి ప్రణాళికలు వివరించాడు. నిర్మలా సీతారామన్‌ గొంతుతో వీడియో, ఫేస్‌ బుక్‌లో వచ్చిన ప్రకటన కావడంతో పెట్టుబడి పెట్టేందుకు వైద్యురాలు అంగీకరించారు. దీంతో సైబర్‌ నేరగాడు.. ఆమె ఆధార్‌, పాన్‌ కార్డు వివరాలు తీసుకుని ఓ నకిలీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసి ఫిన్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ అనే సంస్థలో పెట్టుబడులు పెట్టించాడు. తొలుత వైద్యురాలితో రూ.20వేలు పెట్టుబడి పెట్టించి మంచి లాభాలు వచ్చినట్లు వివరాలను అమెరికా డాలర్లలో చూపించాడు. ఇలా వైద్యురాలిని నమ్మించి ఆమె నుంచి విడతల వారీగా రూ.20.13లక్షలు డిపాజిట్లు చేయించారు. ఆ మొత్తం రూ.68.67లక్షలు (79,850 యూఎ్‌సడీ) అయినట్టు ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో చూపించినా విత్‌డ్రా చేసుకునే అవకా శం లేకుండా చేశారు. ఇదేమని అడిగితే విత్‌డ్రా చేసుకోవాలంటే మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సూచన చేశారు. దీంతో మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - Jun 18 , 2025 | 06:25 AM