Panchayat Raj: డిజిటల్ అటెండెన్స్ యాప్ దుర్వినియోగం!
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:55 AM
పంచాయతీ రాజ్ అధికారులు సమయపాలన పాటిస్తూ.. విధుల నుంచి డుమ్మాలు కొట్టకుండా, గ్రామాల్లో సేవలు అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నిషన్ యాప్) విధానాన్ని అమలులోకి తెచ్చింది.

పంచాయతీ కార్యదర్శుల ‘నకిలీ’ హాజరు.. ఏకంగా సీఎం ఫొటోతో అటెండెన్స్ వేసిన ఓ అధికారి
తీవ్రంగా స్పందించిన సీఎంవో, సస్పెన్షన్ వేటు... రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు అధికారులపై చర్యలు
హైదరాబాద్/రంగారెడ్డి అర్బన్/జగిత్యాల, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ రాజ్ అధికారులు సమయపాలన పాటిస్తూ.. విధుల నుంచి డుమ్మాలు కొట్టకుండా, గ్రామాల్లో సేవలు అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నిషన్ యాప్) విధానాన్ని అమలులోకి తెచ్చింది. విధానం ప్రకారం.. ప్రతీరోజు పంచాయతీ కార్యదర్శులు తాము విధులు నిర్వహిస్తున్న గ్రామం నుంచే ఉదయం 10 గంటల లోపే ఫేస్ రికగ్నిషన్ ద్వారా పంచాయతీ రాజ్ యాప్‌లో హాజరు నమోదు వేసుకోవాలి. అయితే కొందరు పంచాయతీ కార్యదర్శులు నకిలీ ముఖ హాజరుతో విధులకు ఎగనామం పెడుతూ.. డిజిటల్ అటెండెన్స్ యాప్‌ను దుర్వినియోగం చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్యాలయంలోనే ఉన్నట్లు తీసిన ఫొటోను లేదా తమ బదులు ఇతరుల ఫొటోలను యాప్‌లో పెడుతూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇటీవలే ఈ యాప్ లింకును జిల్లా పంచాయతీ శాఖకు అనుసంధానం చేశారు. కొంతమంది రోజూ ఒకే ఫొటో పెట్టడంతో అనుమానం వచ్చి అధికారులు తనిఖీలు ప్రారంభించారు. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో కార్యదర్శులు డిజిటల్ హాజరు నమోదును పరిశీలించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ జి. సృజన.. కలెక్టర్లు, డీపీవోలను ఆదేశించారు. అధికారులు యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్న ఫొటోలను డీపీవో నేతృత్వంలో పరిశీలించగా అసలు విషయం బయటపడింది.
ముఖ్యమంత్రి ఫొటోతో అటెండెన్సు
తాజాగా జగిత్యాల జిల్లా చందయ్యపల్లి గ్రామ కార్యదర్శి రాజన్న, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫొటోతో హాజరు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు రాజన్నను వెంటనే సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా సింగంపల్లి కార్యదర్శి జంగయ్య, భీమారం కార్యదర్శి అనిల్ కుమార్ కూడా విధులకు రాకుండానే హాజరైనట్లు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత రెండు రోజులుగా అధికారులు జరిపిన పరిశీలనలో ఫేస్ రికగ్నిషన్ యాప్‌లో తప్పుడు ఫొటోలు అప్‌లోడ్ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన 200మంది కార్యదర్శులను గుర్తించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పూర్తి సమాచారం సేకరించిన అనంతరం సదరు పంచాయతీ కార్యదర్శులపై చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది