TBP JAC: తెలుగును పరిరక్షించుకోవాల్సిందే
ABN , Publish Date - Apr 28 , 2025 | 03:41 AM
తెలుగు భాష పరిరక్షణ కోసం 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరిగా బోధించాల్సిన అవసరం ఉందని వక్తలు చర్చించారు. సంస్కృతం పరీక్ష దేవనాగరిలో జరిపించాలి, తెలుగు పండితుల శిక్షణ కళాశాలలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు

డిగ్రీ వరకూ ప్రథమ భాషగా బోధించాలి
దేవనాగరిలోనే సంస్కృతం పరీక్ష ఉండాలి
కార్పొరేట్ చేతుల్లో బందీగా ఇంటర్ విద్య
‘మన భాష- మన హక్కు’పై చర్చాగోష్ఠిలో వక్తలు
పంజాగుట్ట, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టు చేస్తూ జీవో జారీచేయాలి. ప్రాథమిక విద్యలో తెలుగు బోధనకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించాలి. అన్ని రకాల ద్వితీయ భాషల సిలబ్‌సలో ఏకరూపత ఉండాలి. తెలుగు చదివిన వారికి పోటీ పరీక్షల్లో బోనస్ మార్కులు ఇవ్వాలి. తిరిగి తెలుగు పండిత శిక్షణ కళాశాలలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మన భాష - మన హక్కు అంశంపై సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలుగు భాష పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్న వక్తలు డిమాండ్ చేశారు. తెలుగులోనే జీవోలు విడుదల చేయాలని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు జూనియర్ కళాశాలల్లో బోధిస్తున్న సంస్కృతం పరీక్ష దేవనాగరి లిపిలోనే రాసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.
ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణకు ఓ కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచించారు. తెలుగు రాకపోతే చరిత్ర, సంస్కృతి తెలుసుకోవడం చాలా కష్టమన్నారు. ఇంటర్ స్థాయిలో కార్పొరేట్ రంగం ఒత్తిడి చాలా తీవ్రంగా ఉందని, ఆ రంగమే ఇంటర్‌బోర్డును శాసిస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంటర్‌లో తెలుగు సిలబస్ మారిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశిం మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి సైతం తెలుగు మాతృభాషకు ప్రమాదం వచ్చిందని ఆందోళన వ్యక్తంచేసిందని గుర్తు చేశారు. ఇంగ్లీష్‌లోనే ‘తెలుగు’ చెప్పమని అనేలా ఉన్నారని, ఇది ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
ప్రముఖ కవి నందిని సిధారెడ్డి మాట్లాడుతూ ఒక్కరోజుతోనే తెలుగుభాష పరిరక్షణ సాధ్యం కాదని, దీనికి దీర్ఘకాలిక ఉద్యమం చేపట్టాలని స్పష్టంచేశారు. హిందీ, సంస్కృతం భాషల నుంచే తెలుగుకు ప్రమాదం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. ‘మన భాష - మన హక్కు’ పేరుతో ఉద్యమించడం ఆత్మగౌరవ సమస్య అని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు అధికారి జయప్రద బాయి, ఆమె వెనుక ఉన్న వారిని దేశం నుంచి వెలివేయాలన్నారు. తెలుగు అకాడమీకి వెంటనే డైరెక్టర్‌ను నియమించడంతోపాటు తెలుగు అధికారభాషా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. తెలుగు భాష అమలుపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు.
తెలుగు భాషా పరిరక్షణ జేఏసీ నూతన కమిటీ
తెలుగు భాషా పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్‌లుగా ఆచార్య సి.కాశిం, డాక్టర్ వెల్దండి శ్రీధర్, డాక్టర్ సంగి రమేశ్, సభ్యులుగా డా. సిల్మా నాయక్, డా.నర్సింహులు, డా.మాలతి, డా.మాణిక్యం, సలహాదారులుగా డా.నందిని సిధారెడ్డి, డా.బన్న ఐలయ్య, డా.ఉమా మహేశ్వర్ రావులతో నూతన కమిటీ ఏర్పాటైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..
For Telangana News And Telugu News