Siddipet: నిలువ నీడ లేక సర్కారు బడిలోనే ఆశ్రయం
ABN , Publish Date - Jul 26 , 2025 | 05:17 AM
ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన ఓ తాజా మాజీ సర్పంచ్‌కు నిలువ నీడ లేకుండా పోయింది.

సిద్దిపేట జిల్లా మైసమ్మవాగు తండా మాజీ సర్పంచ్ కుటుంబం దీనస్థితి
అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్ లావణ్య
బిల్లులు రాక 2 ఎకరాల భూమి, సొంతింటిని అమ్ముకున్న వైనం
మూతబడ్డ స్కూల్లో ఆశ్రయం
అక్కన్నపేట, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన ఓ తాజా మాజీ సర్పంచ్‌కు నిలువ నీడ లేకుండా పోయింది. బిల్లులు రాక, అప్పుల పాలై ఉన్న ఆస్తులను అమ్ముకున్న ఆ మాజీ సర్పంచ్ కుటుంబం.. గత్యంతరం లేని పరిస్థితిలో మూతబడిన ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం పొందుతోంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మవాగు తండా తాజా మాజీ సర్పంచ్ సందేబోయిన లావణ్య దీనస్థితి ఇది. 2019లో బీఆర్‌ఎస్ నుంచి సర్పంచ్‌గా ఎన్నికైన లావణ్య.. బిల్లులు తర్వాత వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి మరీ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. బిల్లులు రాకపోవడం, అప్పుల భారం పెరగడంతో ఇంటితోపాటు రెండెకరాల భూమిని విక్రయించారు.
కానీ అప్పులు తీరలేదు. సొంతింటిని అమ్ముకున్న తర్వాత సమీపంలోని కుందనవానిపల్లి గ్రామంలో ఓ చిన్న ఇంట్లో లావణ్య కుటుంబం అద్దెకు చేరింది. విద్యుదాఘాతానికి గురై ఆ ఇంటి యజమాని గురువారం మరణించగా.. లావణ్య కుటుంబం ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే, సమయానికి గ్రామంలో మరో ఇల్లు లభించకపోవడంతో లావణ్య కుటుంబం మైసమ్మవాగు తండాలో మూతబడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చేరింది. ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని తాజా మాజీ సర్పంచ్ లావణ్య కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News