Bhatti Vikramarka: రైతులు, కూలీలకు అభివృద్ధి ఫలాలు అందాలి
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:02 AM
దేశ నిర్మాణంలో భాగస్వాములవుతోన్న రైతులు, రైతు కూలీల్లో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.

ఆహార భద్రత కల్పిస్తున్నది రైతులే
కేరళలో రైతులు, కార్మికుల మహాసభలో భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : దేశ నిర్మాణంలో భాగస్వాములవుతోన్న రైతులు, రైతు కూలీల్లో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. త్రివర్ణోత్సవం పేరిట కేరళలోని కోజికోడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సోమవారం ఆ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతులు, కార్మికుల మహాసభలో భట్టి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకూడదని, ఏ ఒక్క కూలీ ఒంటరిగా మిగిలిపోకూడదని, అందరికీ అభివృద్ధి ఫలాలను అందించాల్సిన అవసరం ఉందని భట్టి అన్నారు. అధునాతన సాంకేతికత కారణంగా శ్రామికులు, కూలీలకు ఉపాధి మార్గాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో మేధస్సు, ఐక్యత, కారుణ్యంతో పాలకులు పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
వ్యవసాయం ఒక వృత్తి మాత్రమే కాదని, అది కోట్లాది ప్రజల జీవనాధారమని అన్నారు. ప్రస్తుతం రైతులే ఆహార భద్రత కల్పిస్తున్నారని, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తున్నారని తెలిపారు. అపసవ్య రుతుపవనాలు, పెట్టుబడి వ్యయం పెరుగుదల, మార్కెట్ ఒడిదుడుకులు, వాతావరణ మార్పుల వంటి సమస్యలను ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో రూ.21 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేశామని, రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేలు ఇస్తున్నామని, వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నామని వివరించారు.
ఇవి కూడా చదవండి
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్