BJP: ఢిల్లీకి చేరిన పంచాయితీ
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:02 AM
కమలం పార్టీ పంచాయితీ ఢిల్లీకి చేరింది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బహిరంగంగా చేసిన తీవ్ర విమర్శలు బీజేపీతోపాటు మిగతా రాజకీయ పక్షాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

బండి వర్సెస్ ఈటల మాటల యుద్ధం.. హైకమాండ్ స్పందనపై ఉత్కంఠ
నేడు నడ్డాతో రాంచందర్‌రావు భేటీ
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కమలం పార్టీ పంచాయితీ ఢిల్లీకి చేరింది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బహిరంగంగా చేసిన తీవ్ర విమర్శలు బీజేపీతోపాటు మిగతా రాజకీయ పక్షాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే..! దీనిపై పార్టీ అధినాయకత్వం ఎలా స్పందించబోతోంది? అనేది ఉత్కంఠంగా మారింది. ఈటలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా? లేక సంజయ్‌తో సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తుందా? అన్నది చర్చనీయాంశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు కూడా ఢిల్లీ వెళ్తుండడంతో.. అధిష్ఠానం వైఖరి ఆసక్తికరంగా మారిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈటల వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర పార్టీ ముఖ్యులు వీడియో క్లిప్పింగ్‌లను శనివారమే పార్టీ అధినాయకత్వానికి నివేదించగా, ఆదివారం మరో నివేదికను అందించినట్లు సమాచారం. ఈటల నాలుగేళ్ల క్రితం పార్టీలో చేరినప్పటి నుంచి.. ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యతను ఈ నివేదికలో పొందుపరిచారు. ‘‘ఈటల రాజేందర్, ఆయన అనుచరులు బీజేపీలో చేరి నాలుగేళ్లయ్యింది. నాటి కేసీఆర్ సర్కారు ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి, కేసులు పెట్టి జైలుకు పంపేందుకు సిద్థమైతే.. బీజేపీ ఆదుకుంది. పార్టీలో చేర్చుకుని, హుజూరాబాద్ ఉప ఎన్నికలో టిక్కెట్ ఇచ్చింది. ఆయన గెలుపుకోసం పార్టీ శ్రేణులు అహరహం శ్రమించాయి.
3 వేల మంది కాషాయ కార్యకర్తలతోపాటు ఆరెస్సెస్ కార్యకర్తలు, జాతీయవాదులంతా హుజూరాబాద్‌లో ఊరూరా పాగా వేసి.. సొంత ఖర్చుతో తింటూ, సత్రాల్లో, చెట్ల కింద బస చేస్తూ.. ఇంటింటికీ వెళ్లి, ఈటల గెలుపును భుజాన వేసుకుని పనిచేశారు. బీజేపీలో చేరిన కొద్ది రోజులకే ఈటలను ఏకంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. ఆయనకున్న రాజకీయ అనుభవం, నేతలతో ఉన్న పరిచయాలను దృష్టిలో పెట్టుకుని, ఏకంగా జాయినింగ్స్ కమిటీ బాధ్యతలను కూడా అప్పగించారు. అయితే.. ఒక్క ముఖ్య నేతను కూడా ఆయన బీజేపీలోకి తీసుకురాలేకపోయారు. అటు గజ్వేల్, ఇటు హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించడమే కాకుండా.. కేసీఆర్‌ను ఢీకొట్టడానికి అన్ని విధాలా పార్టీ అండగా నిలిచింది.అయినా రెండు స్థానాల్లో చేదు ఫలితమే మిగిలింది. అయినప్పటికీ గత పార్లమెంట్ ఎన్నికల్లో సునాయసంగా గెలిచే మల్కాజిగిరి టక్కెట్ ఇచ్చి గెలిపించుకున్నాం’’ అని ఆ నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు, ఈటల అనుచరులకు పదవులు, ప్రాధాన్యత ఇవ్వలేదనే ప్రచారాన్ని తిప్పికొడుతూ.. కరీంనగర్ జిల్లా, మండల, బూత్ కమిటీల జాబితాను పార్టీ జిల్లా నాయకత్వం విడుదల చేసింది. అందులో ఈటల రాజేందర్ అనుచరులకే 60 శాతానికిపైగా పదవులను కట్టబెట్టినట్లు పేర్కొంటూ.. వారి వివరాలను విడుదల చేసింది. కాగా, సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు కూడా ప్రారంభం కానుండడంతో.. కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తోపాటు కొంతమంది పార్టీ ఎంపీలు ఆదివారం ఢిల్లీ వెళ్లారు. ఈటల మాత్రం సోమవారం ఉదయం వెళ్లనున్నారు.
నేడు నడ్డాతో రాంచందర్‌రావు భేటీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా సంజయ్, ఈటల మధ్య తలెత్తిన విభేదాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలను కూడా ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని ఆ వర్గాల తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News