Share News

Etela Rajender Bandi Sanjay Clash: కమల దళంలో కలకలం

ABN , Publish Date - Jul 20 , 2025 | 02:53 AM

కమలదళంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు ఒక్కసారిగా రచ్చకెక్కింది.

Etela Rajender Bandi Sanjay Clash: కమల దళంలో కలకలం
Etela Rajender Bandi Sanjay Clash

  • చర్చనీయాంశమైన ఈటల వ్యవహారం

  • రాజేందర్‌ వ్యాఖ్యలపై జాతీయ నాయకత్వం ఆరా!

  • క్లిప్పింగులతో నివేదిక పంపించిన రాష్ట్ర బీజేపీ

  • ఈటల పార్టీ లైన్‌ దాటారంటున్న పార్టీ వర్గాలు

  • సొంత పార్టీ నేతను దూషించడంపై అభ్యంతరాలు

హైదరాబాద్‌/హుజూరాబాద్‌, జులై 19 (ఆంధ్రజ్యోతి): కమలదళంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు ఒక్కసారిగా రచ్చకెక్కింది. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌.. కేంద్రమంత్రి బండి సంజయ్‌పై బహిరంగంగా తీవ్ర పదజాలంతో చేసిన విమర్శలు పార్టీలో కలకలం సృష్టించాయి. బీజేపీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఉద్యమనేతగా, విశేష రాజకీయ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు ఉన్న ఈటల.. ఏ లక్ష్యంతో సంజయ్‌పై బహిరంగంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. శామీర్‌పేటలో జరిగింది అసమ్మతి సమావేశమా? లేక కీలక పదవి కోసం జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఈటల ఎత్తువేశారా? అని చర్చించుకుంటున్నారు. బండి సంజయ్‌కి, ఈటలకు మధ్య విభేదాలు పరాకాష్టకు చేరాయని గత కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం జరిగినా, ఎక్కడ కూడా ఇద్దరు నేతలు ఇప్పటివరకు బహిరంగంగా ఆరోపణలు, విమర్శలు చేసుకోలేదు. కానీ, ఈటల ఒక్కసారిగా సంజయ్‌పై విరుచుకుపడ్డ తీరు మాత్రం పార్టీ నేతలను విస్మయానికి గురి చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌, గజ్వేల్‌ స్థానాల్లో పోటీచేసి ఓటమి చవిచూసిన ఈటల.. ఆ తర్వాత మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ఆ తరువాత కేంద్ర మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసుకున్నా ఫలితం దక్కలేదు. బండి సంజయ్‌ వల్లే తనకు ఈ పదవి దక్కలేదన్న భావనతో ఈటల ఉండిపోయారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


జాతీయ నాయకత్వం ఆరా..

కేంద్రమంత్రి సంజయ్‌పై ఈటల చేసిన విమర్శలపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. ఆయన ప్రసంగించిన వీడియో క్లిప్పింగ్‌లను, ఆయన వ్యాఖ్యల అనంతరం స్థానికంగా వ్యక్తమైన స్పందనలతో కూడిన ఒక నివేదికను రాష్ట్రపార్టీ శనివారం జాతీయ నాయకత్వానికి పంపించిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. సొంత పార్టీ నేతను అసభ్య పదజాలంతో దూషించడం, మల్కాజ్‌గిరి ఎంపీగా ఉంటూ.. పార్టీని సంప్రందించకుండా ‘హుజూరాబాద్‌ లో పాగా వేస్తా.. మండలాల వారీగా ఆఫీసులు తెరుస్తా. గెలిపించుకుంటా’ అనడం ద్వారా పార్టీ లైన్‌ను క్రాస్‌ చేశారన్న వాదన కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. హూజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు కూడా.. పార్టీ కంటే తమకు ఈటలే ముఖ్యమన్న అభిప్రాయాన్ని చెప్పినట్లుగా ఉన్నాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ‘‘అసలు హూజూరాబాద్‌ లో బీజేపీయే లేదు. 10 ఓట్లు కూడా రావు. కాషాయ జెండాతో మాకు పనిలేదు. ఈటలే మాకు ముఖ్యం. ఆయనే రావాలి’’ అంటూ ఆయన అనుచరులు చేసిన వ్యాఖ్యలను ఈటల ఖండించకపోవడం విస్మయానికి గురిచేసిందని పార్టీ ముఖ్యనేత ఒకరు అన్నారు. దీనిపై అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 02:53 AM