Hanumakonda: రెండు వేల నాటు కోళ్లు ప్రత్యక్షం.. ఆ ఊళ్లో పండుగే పండుగ
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:45 PM
ఒక్కసారిగా సుమారు 2 వేల వరకు నాటుకోళ్లు ఊళ్లో ప్రత్యక్షం అవడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. చాకచక్యంగా వాటిని పట్టుకొని కూర వండుకొని తిన్నారు. దీంతో ఆ గ్రామం పండుగ వాతావరణాన్ని తలపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హనుమకొండ, నవంబర్ 8: కోడి మాంసం అంటేనే నోరు ఉవ్విల్లూరుతుంది. అందులోనూ నాటుకోడి అంటే.. లొట్టలేసుకుంటూ తింటాం. గ్రామాల్లో ఎక్కువగా నాటుకోళ్లు పెంచుకుంటూ ఉంటారు. కోళ్లు పెద్దవి అయ్యాక వాటిని అమ్మడం గాని, ఏదైనా పండుగల సమయంలో వాటిని కోసుకొని తినడం గానీ చేస్తుంటారు. ఇంట్లో పెంచుకున్న నాటు కోళ్లను తినేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటాం. కానీ ఒక గ్రామంలోని ప్రజలు లక్కీ ఛాన్స్ కొట్టేశారు. ఎవరో నాటు కోళ్లను తీసుకొచ్చి గ్రామంలో వదిలేశారు. దీంతో కోళ్లన్నీ పొలాల చుట్టూ కనిపించాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ ఘటన జరిగింది.
సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నాటుకోళ్లను రోడ్డుపై వదిలి వెళ్లిపోయారు. ఒకటి కాదు రెండు కాదు సుమారు 2 వేల నాటు కోళ్లను వదిలేశారు. ఒక్కసారిగా కోళ్లను చూసిన గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. ఈ విషయం ఆనోటా ఈ నోటా పాకడంతో గ్రామస్తులంతా చేరి కోళ్లను పట్టుకున్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు కోళ్లను పట్టుకొని ఇంటికి తీసుకువెళ్లగా.. కొందరు పదుల సంఖ్యలో తీసుకెళ్లారు. చాకచక్యంగా కోళ్లను పట్టుకొని.. నాటు కోడికూర వండుకొని పండుగ చేసుకున్నారు. ఊరంతా కోళ్లను వండుకుని తినడంతో పండుగ వాతావరణం తలపించింది. ఈ విషయం జిల్లా మొత్తం తెలియడంతో గ్రామస్తులు లక్కీ ఛాన్స్ కొట్టేశారని అందరూ అంటున్నారు. అయితే ఆ కోళ్లను అక్కడ ఎవరు, ఎందుకు వదిలేశారనేది ప్రశ్నార్ధకంగా మారింది.
ఇవి కూడా చదవండి:
మద్యం సేవించి ట్రాక్టర్ కింద పడుకున్నాడు.. తెల్లారేసరికి ఘోరం
రూ.60,799 కోట్లతో కొత్త రోడ్లు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్