Housing Crisis: పరదా కాపురాల పాట్లు!
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:51 AM
బతుకుదెరువు కోసం దుబాయికి వచ్చే వారు ఎదుర్కొనే సమస్యల్లో ఇల్లు సమస్య కీలకం. ఇళ్ల యజమానులు తమ ఇళ్లను అనేక భాగాలుగా విభజించి అద్దెకు ఇస్తుంటారు.

దుబాయిలో ఇరుకు గదుల్లో పలువురు తెలుగు ప్రవాసీలు
మంచం పట్టేంత స్థలంలో కాపురం.. ఒక గదిలో 4 జంటలు
బ్యాచిలర్లైతే 10 మంది.. అక్రమంగా అద్దెకు ఇస్తున్న ఓనర్లు
అధికారుల ఉక్కుపాదం.. ఇతర ప్రాంతాలకు ప్రవాసీలు
భారీగా అద్దెలు, పెరిగిన దూరాభారం
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): బతుకుదెరువు కోసం దుబాయికి వచ్చే వారు ఎదుర్కొనే సమస్యల్లో ఇల్లు సమస్య కీలకం. ఇళ్ల యజమానులు తమ ఇళ్లను అనేక భాగాలుగా విభజించి అద్దెకు ఇస్తుంటారు. అవి ఎంతచిన్నగా ఉంటాయంటే, ఒక గది అంటే ఒక మంచం పట్టేంత స్థలం మాత్రమే. ఆ మంచం చుట్టే ప్లైవుడ్ లేదా పరదాలు కట్టుకొని కాపురాలు చేసే దుస్థితి. ఇప్పుడు పలువురికి ఈ అవకాశం కూడా లేకుండా పోతోంది. ఈ తరహా నివాసాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తనిఖీలు చేస్తూ యజమానులకు జరిమానాలు విధిస్తున్నారు. దీంతో, ఇంతకాలం చవకగా లభించిన ఆశ్రయం ఇక మీదట దూరమయ్యే పరిస్థితిని పలువురు భారతీయులు ఎదుర్కొంటున్నారు. సంపన్నుల నిలయమైన దుబాయిలో సగటు కార్మికుడికి పడుకునే చోటు లభించాలన్నా సవాలక్ష సమస్యలు ఉన్నాయి. అనేక తెలుగు ప్రవాసీ కుటుంబాలు తమవారిని కలుసుకోవాలంటే ఏ రెస్టారెంట్‌లోనో, పార్కులోనో మాత్రమే కలుసుకుంటూ ఉంటాయి. ఇళ్ళకు అతిథులను ఆహ్వనించడానికి వెనుకాడుతారు. ఎందుకంటే, ఇరుకయిన ఇళ్లలో కుర్చీ వేసుకోవడానికి కూడ స్థలం ఉండదు. దుబాయిలో అద్దెకు ఇచ్చే ఇళ్ళు సైజులో పెద్దవేగానీ.. వాటిని నియమాలకు విరుద్ధంగా విభజించి మంచాలు లేదా గదుల వారీగా అద్దెకిస్తున్న అక్రమ విధానం అమలులో ఉంది. ఇది ఇంటి యాజమానులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటోంది. మరోవైపు, ప్రవాసీలకు చవకగా ఆశ్రయం లభిస్తోంది. దుబాయి నిబంధనల ప్రకారం ఒక గదిలో ఒక మనిషికి కనీసం 3.7 చదరపు మీటర్ల వైశాల్యం ఉన్న స్థలం ఉండాలి. కానీ ఆ సైజు లేదా దానికన్నా తక్కువ స్థలంలో ఒక జంట ఉంటోంది. ఒక గదిలో ఒక జంటకు బదులుగా నాలుగు జంటలు పరదాలు కట్టుకొని బంకు బెడ్డులలో కాపురం చేస్తుండగా, బ్యాచిలర్లయితే 10 మంది వరకు నివసిస్తున్నారు. తెలుగు ప్రవాసీయులు ఎక్కువగా ఉన్న దేరా, రిగ్గా, కరమా, సత్వా, ముర్రఖ్తబాద్, బర్ దుబాయిలలో ‘షేర్ అకాడమేషన్’ పేరిట ఈ సంస్కృతి ఎక్కువగా ఉంది. ఒక గది అద్దె 4 వేల దిర్హాంలు ఉంటే, నాలుగు జంటలు వెయ్యి దిర్హాంల చొప్పున చెల్లిస్తూ ఆ ఒక్క గదిలో ఉంటున్నాయి. మంచం చుట్టు పరదా లేదా ప్లైవుడ్‌తో తెరలాగా వేసుకుంటున్నారు.
ఆరోగ్య సమస్యలు.. అగ్ని ప్రమాదాలు
యజమానులు తమ ఇళ్లలోని మొత్తం స్థలాన్ని అద్దెకు ఇస్తుండటంతో.. గాలి, వెలుతురు లేని ఇరుకు కారణంగా పలువురు ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాదు, అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దుబాయిలో జరుగుతున్న ఆగ్ని ప్రమాదాలలో 74 శాతానికి పైగా ఈ తరహా ఇరుకు గదులే కారణమని ఇటీవల ఓ అధికారిక నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో, షేర్ అకాడమేషన్‌పై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. పోలీసులు, మునిసిపాల్టీ, విద్యుత్ అధికారులు సంయుక్తంగా తనఖీలు చేస్తూ జరిమానాలు విధిస్తున్నారు. దీని వెనుక దుబాయి స్థిరాస్తి వ్యాపారుల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. షేర్ అకామడేషన్ విధానం తమ వ్యాపారాభివృద్ధికి అడ్డంకిగా తయారైందని భావించి ఆ విధానాన్ని తొలగించటానికి వారు సైతం ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో తెలుగు ప్రవాసీలు ఆశ్రయం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా, అద్దె తక్కువ ఉండే షార్జాకు తరలివెళ్తున్నారు. అయితే, ఇది చాలామందికి ఆర్థికంగా భారంగా పరిణమిస్తోంది. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వందలాది మంది మహిళలు దుబాయిలో ఇళ్ళలో పాచి పనులు చేస్తుంటారు. వీరంతా ఇపుడు షార్జాలో ఉండి దుబాయికి వెళ్లి రావటానికి డబ్బుపరంగా ఇబ్బందులు ఎదుర్కోవటమేగాక ప్రయాణ బడలికతో అలిసిపోతున్నారు. తెలంగాణ కార్మికులది కూడ అదే పరిస్ధితి. కాగా, దుబాయి నగర శివారులో ఉన్న లేబర్ క్యాంపులలో వసతుల అభివృద్ధిపై సర్కారు దృష్టి సారిస్తోంది. 50 మందికిపైగా కార్మికులు ఉన్న ప్రతి సంస్థ విధిగా తమ లేబర్ క్యాంపు వసతి వివరాలను ప్రభుత్వం వద్ద నమోదు చేయాలని నిర్దేశిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News