Share News

బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి 10 కోట్ల విరాళం

ABN , Publish Date - Feb 27 , 2025 | 04:53 AM

బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు అమెరికాకు చెందిన డా. రాఘవేంద్ర ప్రసాద్‌, కళ్యాణి ప్రసాద్‌ దంపతులు రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు.

బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి 10 కోట్ల విరాళం

  • ప్రకటించిన ఎన్‌ఆర్‌ఐ దంపతులు

  • మొదటి విడతలో రూ.5 కోట్ల చెక్కు అందజేత

బంజారాహిల్స్‌, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు అమెరికాకు చెందిన డా. రాఘవేంద్ర ప్రసాద్‌, కళ్యాణి ప్రసాద్‌ దంపతులు రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు. ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ రిసెర్చి ఫౌండేషన్‌ ద్వారా పరిశోధనా పరికరాలను సమకూర్చుకోవాలని బసవతారకం కాన్సర్‌ ఆస్పత్రి రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్ణయించగా, అందుకు సహకరించేందుకు రాఘవేంద్ర ప్రసాద్‌ దంపతులు విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. మొదటి విడతలో భాగంగా బుధవారం ఆసుపత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో చైర్మన్‌ నందమూరి బాలకృష్ణకు రూ. 5 కోట్ల చెక్కును అందజేశారు.


ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. పేదలకు అందుబాటు ధరలలో ప్రపంచస్థాయి క్యాన్సర్‌ చికిత్స అందించాలనే లక్ష్యంతో నిరంతరం పనిచేస్తున్నట్టు చెప్పారు. క్యాన్సర్‌పై చేయబోయే పరిశోధన కోసం డాక్టర్‌ ప్రసాద్‌ దంపతులు ముందుకు రావడం అభినందనీయమని, పరిశోధనలకు వారి పేర్లను పెట్టనున్నామని చెప్పారు. డాక్టర్‌ రాఘవేంద్ర ప్రసాద్‌ను బోర్డు మెంబర్‌గా చేరాలని ఆహ్వానించినట్టు తెలిపారు. కళ్యాణి ప్రసాద్‌ క్యాన్సర్‌పై పోరాడి విజయాన్ని సాధించారని వెల్లడించారు.

Updated Date - Feb 27 , 2025 | 04:53 AM