Indian Constitution: రాజ్యాంగమే మనల్ని ఏకతాటిపై నిలుపుతోంది
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:07 AM
భారతీయులను ఏకతాటిపై నిలుపుతున్నది రాజ్యాంగమేనని ఆర్థిక వేత్త డాక్టర్ నరేంద్ర జాదవ్ అన్నారు. 75 సంవత్సరాలుగా మన రాజ్యాంగం మరింత బలంగా మారిందని, అందరూ దానికి కట్టుబడి ఉంటున్నారని చెప్పారు.

75 ఏళ్లల్లో మరింత బలంగా మారింది
నేటి పరిస్థితులను నాడే ఊహించిన అంబేడ్కర్
రాజ్యాంగ రచనకు 1895లోనే బీజం
జస్టిస్ కొండా మాధవరెడ్డి స్మారకోపన్యాసంలో నరేంద్ర జాదవ్
హైదరాబాద్ సిటీ, మార్చి 1(ఆంధ్రజ్యోతి): భారతీయులను ఏకతాటిపై నిలుపుతున్నది రాజ్యాంగమేనని ఆర్థిక వేత్త డాక్టర్ నరేంద్ర జాదవ్ అన్నారు. 75 సంవత్సరాలుగా మన రాజ్యాంగం మరింత బలంగా మారిందని, అందరూ దానికి కట్టుబడి ఉంటున్నారని చెప్పారు. శనివారం ఆయన ఏవీ కళాశాలలో జస్టిస్ కొండా మాధవరెడ్డి స్మారకోపన్యాసంలో ‘55 సంవత్సరాల రాజ్యాంగ నిర్మాణం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్ర’ అనే అంశంపై మాట్లాడారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా అంబేడ్కర్ చేసిన ప్రసంగ పాఠాన్ని ప్రతి భారతీయుడూ చదవాలని, ఆయన ఆ ప్రసంగంలో ఎన్నో హెచ్చరికలూ చేశారన్నారు. ముగ్గురు అమెరికన్ విద్యావేత్తలు వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, ఒక దేశ రాజ్యాంగం సరాసరి జీవితకాలం 17 సంవత్సరాలని తేల్చారన్నారు. కానీ మన దేశ రాజ్యాంగం బలంగా మారి 144 కోట్ల మంది ప్రజలను ఏకం చేస్తోందన్నారు. ‘మన రాజ్యాంగానికి 75 ఏళ్లు అవుతుంటే 55 ఏళ్లు అంటున్నారేంటని అడగొచ్చు. 1946-1950 వరకూ రాజ్యాంగ నిర్మాణం కోసం విధానసభ పనిచేసిందనే అందరూ చెబుతారు. కానీ ఇది అర్ధసత్యమే. వాస్తవానికి భారత రాజ్యాంగం 55 సంవత్సరాల ప్రక్రియ ఫలితం. మన రాజ్యాంగ రచనకు 1895లోనే బీజం పడింది.
అందుకే 55 ఏళ్ల భారత రాజ్యాంగ నిర్మాణమని చెబుతున్నాన’ని వివరించారు. దీనికి బ్రిటీష్ పాలకులు, మన దేశ నాయకులు ఏకకాలంలో ఎవరికి వారు పనిచేశారన్నారు. 1946లో రాజ్యాంగ ప్రక్రియ కోసం విధానసభ ఏర్పడిన తరువాత వారు కలిసి పనిచేశారన్నారు. 1895 నుంచి మొత్తం జరిగిన 12 ప్రయత్నాల్లో ఎక్కువ వాటిలో కనిపించిన వ్యక్తి అంబేడ్కర్ మాత్రమేనని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాణానికి మొదటి ప్రయత్నం అనిబిసెంట్ నేతృత్వంలో 1895లో జరిగిందన్నారు. అంబేడ్కర్ తన 26 ఏళ్ల వయసులోనే సౌత్‌బరో కమిటీ ముందు వాదనలు వినిపించారన్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ అంబేడ్కర్ రాజ్యాంగ రచన చేస్తూ స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం వంటి వాటిని స్పష్టంగా నిర్వచించారన్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పొందుతున్నవారిని పరాన్నజీవులుగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం మానవత్వాన్ని తగ్గించడమేనన్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అపోలో ఆస్పత్రుల జేఎండీ డాక్టర్ సంగీతా రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, పలువురు మాజీ జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.