Share News

Ambedkar Statue: అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసం

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:25 AM

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనలు రాష్ట్రంలో ఆదివారం వెలుగు చూశాయి.

Ambedkar Statue: అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసం

  • వికారాబాద్‌ జిల్లా పుట్టపహాడ్‌, ఖమ్మం జిల్లా కనకగిరి సిరిపురంలో గుర్తు తెలియని వ్యక్తుల దుశ్చర్య

పరిగి, వైరా, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనలు రాష్ట్రంలో ఆదివారం వెలుగు చూశాయి. వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం పుట్టపహాడ్‌, ఖమ్మం జిల్లా వైరా మండలంలోని కనకగిరి సిరిపురంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. పుట్టపహాడ్‌ గ్రామ చౌరస్తాలోని అంబేడ్కర్‌ విగ్రహాన్ని శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహంలోని తల భాగం, చేతి భాగాలు దెబ్బతినగా ఓ చెయ్యి విరిగి కింద పడింది.


ఈ ఘటనపై వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల శ్రేణులు పరిగి-మహాబూబ్‌నగర్‌ రోడ్డుపై ఆదివారం ఉదయం ఆందోళన చేపట్టారు. అనంతరం కులకచర్ల, పరిగి పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇక, వైరా మండలం కనకగిరి సిరిపురం గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు రెండ్రోజుల క్రితం ధ్వంసం చేశారని భీమ్‌ వారియర్స్‌, అంబేద్కర్‌ యువజన సంఘాల సభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్‌ ముక్కుకు నల్లరంగు పూసిన దుండగులు, కళ్లను ధ్వంసం చేసేందుకు యత్నించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 23 , 2025 | 04:25 AM