NIMS: నిమ్స్‌కు వైద్యుల టాటా
ABN , Publish Date - Feb 27 , 2025 | 04:17 AM
రాష్ట్రంలో పేదోడి వైద్యానికి పెద్ద భరోసాగా నిలిచే నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రి నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యులు వైదొలుగుతున్నారు.

కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్న పలువురు
ఈ మధ్యే 10 మంది వైద్యుల రాజీనామా
ప్రత్యేక వైద్య సేవలపై తీవ్ర ప్రభావం
వైద్యులకు అందని ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్‌లు
కనీస ప్రోత్సాహం కరువైందన్న ఆవేదన
సంస్థ డైరెక్టర్ తీరు కూడా ఓ కారణమా?
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేదోడి వైద్యానికి పెద్ద భరోసాగా నిలిచే నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రి నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యులు వైదొలుగుతున్నారు. ఇటీవల కాలంలో ఏకంగా కీలక విభాగాలకు చెందిన పది మంది వైద్య నిపుణులు రాజీనామా చేశారు. తాజాగా ఇద్దరు వైద్యులు తమ రాజీనామా పత్రాన్ని నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు పంపారు. కొద్దినెలలుగా నిమ్స్ నుంచి వెళ్లిపోయే వైద్యుల సంఖ్య పెరుగుతుండగా... కొత్తగా వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉంటోంది. గడచిన మూడేళ్లలో నిమ్స్‌లో లక్ష సర్జరీలు జరిగాయి. అంటే వైద్యులు రోజుకు సగటున వందకుపైగా సర్జరీలు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతటి నైపుణ్యమున్న వైద్యులంతా నిమ్స్‌ను వీడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
నాలుగు విభాగాలు దాదాపు ఖాళీ
నిమ్స్‌లో పలు కీలక విభాగాల విభాగాధిపతులు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొద్ది రోజులుగా వరుసగా రాజీనామా చేస్తుండటాన్ని అక్కడి వైద్య సిబ్బంది, మెడికోలు జీర్జించుకోలేకపోతున్నారు. నిమ్స్ న్యూరో సర్జరీ హెచ్‌వోడీగా ఉన్న డాక్టర్ విజయ సారథితో పాటు డాక్టర్ రాజేశ్ రాజీనామా చేసి వెళ్లిపోయారు. అలాగే న్యూరాలజీకి చెందిన హెచ్‌వోడీ డాక్టర్ జబీన్‌తో పాటు డాక్టర్ నిహారిక, డాక్టర్ రూపం (ప్రొఫెసర్), డాక్టర్ రుక్మిణి (ప్రొఫెసర్) నిమ్స్‌ను వీడారు. ఆ ఒక్క విభాగం నుంచే ఏకంగా నలుగురు వెళ్లిపోయారు. ఇక, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి చెందిన డాక్టర్ ఆదిత్యతో పాటు మరో అసోసియేట్ ప్రొఫెసర్ రాజీనామా చేసి వెళ్లిపోయారు. తాజాగా యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ధీరజ్ కూడా రెండు రోజుల క్రితం రాజీనామా లేఖలను నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఇచ్చినట్లు నిమ్స్ వర్గాలు వెల్లడించాయి.
వైద్య సేవలు, సీట్లపై తీవ్ర ప్రభావం
గతేడాది నిమ్స్‌లో ఏకంగా 37 వేల శస్త్ర చికిత్సలు జరిగాయి. అలాగే భారీ సంఖ్యలో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా జరుగుతున్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో ఏకంగా వెయ్యికిపైగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. అంటే కార్పొరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయన్న మాట. ప్రస్తుతం ఎంతో నైపుణ్యమున్న ప్రొఫెసర్లు, విభాగాధిపతులు ఒక్కొక్కరుగా నిమ్స్‌ను వీడుతుండటంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. నిష్ణాతులైన వైద్యులు లేకుంటే శస్త్ర చికిత్సల సంఖ్య కూడా తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. హెచ్‌ఓడీలు, ప్రొఫెసర్లు తగినంత మంది లేకుంటే సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్లపై కూడా ఆ ప్రభావం చూపే అవకాశముంది.
డైరెక్టర్ వైఖరి కూడా కారణమా?
స్పెషలిస్టు వైద్యులు నిమ్స్‌ను వీడటం వెనుక ఆ ఆస్పత్రి డైరెక్టర్ వైఖరి కూడా ఓ కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. నెలకు వందల సంఖ్యలో శస్త్ర చికిత్సలు చేసే వైద్యులకు రావాల్సిన ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్‌లు కొన్నేళ్లుగా ఇవ్వడం లేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచే ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలు చేసే వైద్యులకు కేసుకు ఇంత చొప్పున ఇన్సెంటివ్‌లు ఇచ్చేవారు. దాంతో వారు మరిన్ని శస్త్ర చికిత్సలు చేసేందుకు ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం వాటిని ఇవ్వకపోగా... రావాల్సిన వాటి విషయంలోనూ డైరెక్టర్ చొరవ చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు రోగులకు అందించాల్సిన వైద్య సేవల కంటే వైద్యులను రీసెర్చ్ పేపర్స్ ఎన్ని చేశారంటూ సతాయింపులు కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
Read Also : టన్నెల్‌లో తాజా పరిస్థితి ఇది.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..
ఇదెక్కడి వింత రైలు.. రోడ్డు మీద నడస్తున్న ఈ విచిత్రాన్ని చూస్తే షాకవ్వాల్సిందే..
తమిళనాడు సీఎంకు అమిత్ షా కౌంటర్.. 5 లక్షల కోట్లు ఇచ్చామని వెల్లడి