Share News

Kumarambheem Asifabad: ఆ 12 గ్రామాలు మావే..!

ABN , Publish Date - Jul 18 , 2025 | 03:42 AM

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని 12 వివాదాస్పద గ్రామాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ గ్రామాలు తమ పరిధిలోకే వస్తాయని మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖర్‌ భావన్కులే ముంబైలో ప్రకటించారు.

Kumarambheem Asifabad: ఆ 12 గ్రామాలు మావే..!

  • తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలపై మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ప్రకటన

  • తెలంగాణలోనే కొనసాగించాలని

  • సరిహద్దు గ్రామాల ప్రజల ఆందోళన

  • ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

ఆసిఫాబాద్‌/కెరమెరి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని 12 వివాదాస్పద గ్రామాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ గ్రామాలు తమ పరిధిలోకే వస్తాయని మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖర్‌ భావన్కులే ముంబైలో ప్రకటించారు. దీంతో వివాదాస్పద గ్రామాల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలో ఉన్న పరందోళి, అంతాపూర్‌ గ్రామ పంచాయతీల పరిధిలోని 12 గ్రామాలు.. పరందోళి, అంతాపూర్‌, ఎస్సాపూర్‌, కోట, పరస్వాడ, బోలాపటార్‌, పద్మావతి, ఇందిరానగర్‌, మహారాజ్‌గూడ, ముక్దంగూడ, లెండిజాల, గౌరి ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని ఈ గ్రామాలను భౌగోళికంగా తమకు అనుకూలంగా ఉందనే కారణంతో 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రాపూర్‌ జిల్లా జివితి తాలూకాలో చేర్చుకుంది. అప్పటి నుంచి వివాదం ప్రారంభమైంది.


ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంగా మారిన నేపథ్యంలో 12 గ్రామాల భవితవ్యం తేల్చేందుకు 1989లో కేంద్రం నియమించిన కేకే నాయుడు కమిషన్‌ ఈ గ్రామాల పరిస్థితులపై క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. పరందోళి పంచాయతీని విభజించి అంతాపూర్‌ పేరుతో మరో పంచాయతీని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. వీటి పరిధిలోని మిగిలిన 10 గ్రామాలూ ఆంధ్రప్రదేశ్‌కే చెందాలని ముంబైలో నిర్వహించిన సమావేశంలో తీర్మానించి, కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ గ్రామాలను తెలంగాణలో కలిపింది. దీన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇప్పటికీ ఆ కేసు పెండింగ్‌లోనే ఉంది. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం 12 గ్రామాలు తమవేనని ప్రకటించడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాము తెలంగాణలోనే కొనసాగుతామంటూ సరిహద్దు గ్రామాల ప్రజలు గురువారం కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రేకు వినతి పత్రం అందజేశారు.


ఇవి కూడా చదవండి

స్వచ్ఛ సర్వేక్షణ్‎ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 03:42 AM