Warangal: కొండా మురళిపై చర్యలు తీసుకుంటారా.. లేదా?
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:51 AM
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ సీనియర్ నేత కొండా మురళి వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ విచారణ కొనసాగుతూనే ఉంది.

నియోజకవర్గాల్లో వారి జోక్యం ఎక్కువైంది
వారిలా మేం అన్ని పార్టీలూ మారలేదు
బాధితులమైన మమ్మల్నే కమిటీ ముందుకు పిలవడం మరింత అవమానకరం
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల అసహనం
వారి అభిప్రాయాల్ని రికార్డు చేసిన కమిటీ
హైదరాబాద్/వరంగల్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ సీనియర్ నేత కొండా మురళి వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ విచారణ కొనసాగుతూనే ఉంది. గురువారం గాంధీభవన్‌లో ఈ అంశంపైన కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన భేటీలో ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల అభిప్రాయాలను రికార్డు చేశారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డిలు వివాదానికి సంబంధించి తమ అభిప్రాయాలు చెప్పారు. అయితే సమస్యపైన అనవసరమైన హడావుడి చేస్తున్నారని, సమస్యను పెంచుతున్నారా లేక తగ్గిస్తున్నారా అని కడియం శ్రీహరి ప్రశ్నించినట్లు తెలిసింది. తమ నియోజకవర్గాల్లో కొండా దంపతుల జోక్యం పెరిగి పోయిందంటూ కమిటీ దృష్టికి ఎమ్మెల్యేలు తెచ్చారు. తమపై మీడియా ముఖంగానే విమర్శలు చేసిన కొండా మురళిపైన చర్యలు తీసుకుంటారా లేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
తామూ పార్టీ మారి ఉండొచ్చునని, కానీ కొండా కుటుంబంలాగా అన్ని పార్టీలూ మారి వచ్చిన వాళ్లం కాదన్నారు. కొండా మురళి తిట్లకు బాధితులమైన తమను క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలవడం తమకు అవమానకరంగా ఉందని వారు చెప్పినట్లు సమాచారం. అయితే తమకు వచ్చిన ఫిర్యాదు మేరకే అభిప్రాయాలు తీసుకుంటున్నామని మల్లు రవి వారికి వివరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కలిసి పనిచేయాల్సిన నేతల మధ్య విభేదాలు పార్టీకే నష్టం చేకూర్చుతాయని సముదాయించారు. అనంతరం మీడియాతో మల్లు రవి మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా వివాదంపైౖ 2 గంటల పాటు చర్చించామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి అభిప్రాయాలు చెప్పారన్నారు. ఈ సమస్యపై మరోమారు భేటీ అవుతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వచ్చే సోమవారం క్రమశిక్షణా చర్యల కమిటీ మళ్లీ భేటీ కానుందని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
Read Latest Telangana News and National News