Digital Media: డిజిటల్ మీడియాతో సంక్షోభంలో జర్నలిజం
ABN , Publish Date - Mar 16 , 2025 | 05:24 AM
డిజిటల్ ప్రసార మాధ్యమాల వ్యాప్తితో జర్నలిజం ప్రస్తుతం ఏక మార్గ సమాచార వ్యవస్థగా మారిందని చెన్నై ఏషియన్ జర్నలిజం కళాశాల డీన్ మోహన్ రామమూర్తి అన్నారు.

ప్రభుత్వ తప్పిదాలను ఎదిరించేందుకు సంపాదకులకు లేని స్వేచ్ఛ
ప్రముఖ పాత్రికేయులు నార్ల 29వ స్మారకోపన్యాసంలో వక్తలు
హైదరాబాద్ సిటీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): డిజిటల్ ప్రసార మాధ్యమాల వ్యాప్తితో జర్నలిజం ప్రస్తుతం ఏక మార్గ సమాచార వ్యవస్థగా మారిందని చెన్నై ఏషియన్ జర్నలిజం కళాశాల డీన్ మోహన్ రామమూర్తి అన్నారు. ఇది ప్రింట్ మీడియా ఆదాయాన్ని, వార్తలు చదివే వాళ్ల సంఖ్యను, పత్రికలు చదవాలనే కుతుహలాన్ని తగ్గిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు 29వ స్మారకోపన్యాసం శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని డా. బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నార్ల చిత్రపటానికి అంబేడ్కర్ వర్సిటీ ఉపకులపతి ప్రొ. ఘంటా చక్రపాణి, ప్రముఖ సంపాదకులు డా.కె. శ్రీనివాస్, అంబేడ్కర్ వర్సిటీ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డా.ఎల్ విజయ కృష్ణారెడ్డి, మోహన్ రామమూర్తితో పలువురుపూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ‘‘కృత్రిమ మేధస్సు యుగంలో జర్నలిజం భవిష్యత్తు’’ అనే అంశంపై మోహన్ రామమూర్తి ప్రసంగిస్తూ, జర్నలిజంలో కృత్రిమ మేధస్సు కొంత వరకే ఉపయోగపడుతుందని, దాన్ని ఎంత మేరకు వాడాలో అంతే వాడితో బాగుంటుందని పేర్కొన్నారు. అనంతరం ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితిలో నార్లలాంటి పాత్రికేయులు సమాజానికి చాలా అవసరమని అన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎదిరించే స్వేచ్ఛ, ధైర్యం ప్రస్తుత సంపాదకులకు లేదని, మీడియా సంస్థలు ఎక్కువ శాతం పెట్టుబడిదారులు లేదంటే రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నార్ల రాసిన, సేకరించిన పుస్తకాలను ఆయన కుటుంబసభ్యులు అంబేడ్కర్ విశ్వవిద్యాలయ లైబ్రరీకి అందించడం సంతోషంగా ఉందని, ఆయన పేరుతో విశ్వవిద్యాలయంలో ప్రత్యేక లైబ్రరీని నెలకొల్పడం గర్వంగా ఉందని చక్రపాణి పేర్కొన్నారు.